Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌.. వైసీపీ ఎంపీ మాగుంటకు మరోసారి ఈడీ నోటీసులు.. రేపు విచారణకు రావాలని ఆదేశం..

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ విచారణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఈ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ మరోసారి నోటీసులు జారీచేసింది. 

Ed once again notice to YSRCP MP Magunta Srinivasulu Reddy in Delhi liquor scam
Author
First Published Mar 20, 2023, 5:39 PM IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ విచారణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఈ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ మరోసారి నోటీసులు జారీచేసింది. తొలుత మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ అధికారులు ఈ నెల 18న విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. అయితే ఆ రోజు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈడీ విచారణకు గైర్హాజరు అయ్యారు. తన సోదరుని కుమారుడు అనారోగ్యంగా ఉన్న కారణంగా తాను చెన్నై వెళ్లాల్సి వచ్చిందని అందుకే తాను విచారణకు రాలేకపోతున్నానని మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 

ఈ క్రమంలోనే మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ అధికారులు తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు. మంగళవారం (మార్చి 21) రోజున విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. మరి ఈ నోటీసుల మేరకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి.. ఈడీ విచారణకు హాజరువుతారా? లేదా? అనేది  వేచిచూడాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే.. ఈ కేసులో మాగుంట శ్రీనివాసులు  రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ్ రెడ్డి ఇప్పటికే అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రాఘవ్ రెడ్డిని దర్యాప్తు అధికారులు విచారించారు. ఇటీవల రాఘవ్ రెడ్డి జ్యుడీషియల్‌ రిమాండ్‌ను ఢిల్లీలోని రౌజ్‌ అవెన్యూలో కోర్టు ఈ నెల 28 వరకు పొడిగించింది. ప్రస్తుతం రాఘవ్ రెడ్డి తిహార్ జైలులో ఉన్నారు. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మూడు మద్యం కార్టెళ్ల ప్రమేయం ఉందని ఈడీ ఆరోపించింది. వాటిలో రెండు దక్షిణాదిలో ఉన్నాయి.. అందులో ఒకటి మాగుంట కుటుంబం యజమాన్యంలో ఉందని అభియోగాలు మోపింది. మాగుంటకు చెందిన బాలాజీ డిస్టిలరీస్ ఇప్పుడు రద్దు చేయబడిన ఢిల్లీ మద్యం పాలసీ వల్ల లాభపడిందని ఆరోపించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios