ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ కోణాన్ని విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. తాజాగా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు జారీచేశారు. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ కోణాన్ని విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఇప్పటికే పలువురిని ఈడీ అరెస్ట్ చేయగా.. మరికొందరికి సమన్లు జారీచేసి విచారణ జరుపుతుంది. అయితే తాజాగా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు జారీచేశారు. ఈ నెల 18న విచారణకు రావాలని సమన్లలో ఈడీ పేర్కొంది. ఇక, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సౌత్ గ్రూప్‌ తరఫున మిగిలిన వ్యక్తులతో పాటు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే మాగుంట రాఘవరెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాఘవరెడ్డి తీహార్ జైలులో ఉన్నారు.

ఇదిలా ఉంటే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత ప్రమేయాన్ని ఆడిటర్ బుచ్చిబాబు ధృవీకరించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది. అరబిందో ఫార్మాకు చెందిన శరత్ చంద్రారెడ్డి, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి హవాలా ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) రూ. 100 కోట్లు చెల్లించేందుకు కవిత ఏర్పాట్లు చేశారని ఈడీ ఆరోపించింది.

ఫిబ్రవరి 23న నమోదైన బుచ్చిబాబు వాంగ్మూలాన్ని ఉటంకిస్తూ.. కవిత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాల మధ్య రాజకీయ అవగాహన ఉందని ఈడీ పేర్కొంది. కవిత 2021 మార్చి 19, 20 తేదీల్లో ఢిల్లీలోని గౌరీ అపార్ట్‌మెంట్స్‌లో కేజ్రీవాల్, సిసోడియా ప్రతినిధి విజయ్ నాయర్‌ని కలిశారని తెలిపింది. ఈ సందర్బంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో తాము ఏమి చేయగలమో కవితకు విజయ్ నాయర్ వివరించే ప్రయత్నం చేరని.. మద్యం పాలసీలో, మద్యం వ్యాపారంలో కవితకు చేసే సహాయానికి బదులుగా ఆప్‌కు కొంత నిధులు ఇవ్వాలని ప్రతిపాదించారని పేర్కొంది.