Asianet News TeluguAsianet News Telugu

ఈసీ సంచలన నిర్ణయం.. కౌంటింగ్ వేళ ఎన్నడూ లేనంతగా కొత్త రూల్స్!

దేశ వ్యాప్తంగా సార్వత్రిక  ఎన్నికల పోరు ముగియడంతో ఫలితాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులతో పాటు సామాన్య ప్రజల్లోనూ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు (election counting) కోసం ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ లో ఘర్షణలు చోటు చేసుకున్న నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనంతగా కొత్త రూల్స్ ను కట్టుదిట్టంగా అమలు చేస్తోంది....

EC preparation for Andhra Pradesh election counting
Author
First Published Jun 2, 2024, 4:09 PM IST

దేశ వ్యాప్తంగా సార్వత్రిక  ఎన్నికల పోరు ముగియడంతో ఫలితాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులతో పాటు సామాన్య ప్రజల్లోనూ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు (election counting) కోసం ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ లో ఘర్షణలు చోటు చేసుకున్న నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనంతగా కొత్త రూల్స్ ను కట్టుదిట్టంగా అమలు చేస్తోంది....

దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ సార్వత్రిక ఎన్నికలు. ఏడు దశల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమరం నిన్నటి(జూన్‌ 1)తో ముగిసింది. దీంతో నిన్న (శనివారం) సాయంత్రం ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడ్డాయి. దేశంలో ఎన్‌డీయేనే మళ్లీ అధికారంలోకి వస్తుందని అత్యధిక సర్వే సంస్థలు అంచనా వేశాయి. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ వైసీపీదే అధికారమని 'ఆరా' సహా పలు సంస్థలు సర్వే ఫలితాలు వెల్లడించగా... టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అత్యధిక స్థానాలతో విజయం సొంతం చేసుకుంటుందని పలు సర్వే సంస్థలు తెలిపాయి. కాగా, ఎవరికి వారే తమదే విజయమన్న ధీమాలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. 

ఇదిలా ఉండగా... ఈ నెల 4న అంటే మంగళవారం కౌంటింగ్‌ నిర్వహించి ఫలితాలను వెల్లడించేందుకు ఎన్నికల సంఘం సర్వం సిద్ధమైంది. ఇప్పటికే కౌంటింగ్‌ సిబ్బంది, అధికారులకు శిక్షణ ప్రక్రియను సైతం పూర్తిచేసింది. ఆయా రాజకీయ పార్టీలు అభ్యర్థుల తరఫున ప్రతినిధులుగా కౌంటింగ్‌ ఏజెంట్లను ఎంపిక చేసి.. వారికి శిక్షణ ఇచ్చాయి. కౌంటింగ్‌ రోజు కౌంటింగ్‌ హాలులో ఏజెంట్లు పాటించాల్సిన నిబంధనలపై ఇప్పటికే ఈసీ మార్గదర్శకాలను విడుదల చేసింది.  

కౌంటింగ్‌పై దిశానిర్దేశం...
మరోవైపు, ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు, కచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేందుకు జిల్లాల వారీగా చేస్తున్న ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా కీలక సమావేశం నిర్వహించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల ఎన్నికల అధికారులకు ఆదేశాలిచ్చారు. ఎన్నికల సిబ్బంది రాండమైజేషన్, పోస్టల్ బ్యాలెట్‌ల లెక్కింపు, ఈవీఎంలలో ఫోల్డ్ అయిన ఓట్ల లెక్కింపునకు అవసరమైన శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, రౌండ్ల వారీగా ఫలితాల ట్యాబులేషన్ తదితర అంశాలపై సీఈఓ మీనా దిశానిర్దేశం చేశారు. అలాగే, ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఈవీఎంలను సీల్ చేసే విధానంపై అవగాహన, స్టేట్యూటరీ నివేదిక, రౌండ్ వైస్ నివేదికలు పంపించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటుపై చర్చించారు.  రౌండ్ల వారీగా ఎప్పటికప్పుడు ఫలితాల నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ నెల 8వ తేదీలోపు నివేదించాల్సిన ఇండెక్స్ కార్డు రూపొందించే విధానం, కౌంటింగ్‌ సమయంలో మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు తదితర  అంశాలపై జిల్లాల వారీగా ఎన్నికల అధికారులకు వివరించారు.

మద్యంప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌...
ఎల్లుండి (మంగళవారం) ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభం కానుండగా, ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 3, 4, 5 తేదీలు మూడు రోజులపాటు మద్యం  దుకాణాలు మూతపడనున్నాయి. మూడు రోజుల పాటు మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు డీజీపీ హరీశ్‌ కుమార్ గుప్తా ఇప్పటికే వెల్లడించారు. అంటే ఫలితాలు వెలువడిన మరుసటి రోజు కూడా మందుబాబులకు బ్యాడ్‌ న్యూసే అని చెప్పాలి. మరోవైపు కౌంటింగ్‌ కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే నిఘా పటిష్టం చేశారు. పల్నాడు, అనంతపురం, తిరుపతి సహా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నేపథ్యంలో ఘర్షణలు చోటుచేసుకున్న జిల్లాల్లో అనేకచోట్ల నిఘా పెంచారు. పోలీస్ పికెటింగ్‌లు, ఫ్లాగ్‌ మార్చ్‌లు నిర్వహిస్తున్నారు. కౌంటింగ్‌ రోజు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర అదనపు బలగాలను సైతం ఆంధ్రప్రదేశ్‌లో రంగంలోకి దింపారు. కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం సూచనలతో ఈ నెల 15వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిఘా కొనసాగనుంది...

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios