20 మంది ‘ఆప్’ ఎంఎల్ఏలపై అనర్హత

20 మంది ‘ఆప్’ ఎంఎల్ఏలపై అనర్హత

ఎన్నికల సంఘం పక్షపాతంతో వ్యవహరిస్తోందా? అందరికీ సమన్యాయం చేయాల్సిన ఇసి కొందరి విషయంలో ఒకలాగ మరికొందరి విషయలో మరోలాగా వ్యవహరిస్తోందా? గ్రౌండ్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరి అనుమానాలు నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే, తాజాగా ఇసి తీసుకున్న ఓ నిర్ణయం అందుకు ఊతమిస్తోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే ఢిల్లీలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ 2015లో 21 మందిని పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించారు. అయితే, ఆ నియామకం చెల్లదంటూ ఇసి అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాకుండా వారందరినీ ఏకంగా ఎంఎల్ఏల పదవులకే అనర్హులను చేయాలంటూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా వారిపై అనర్హత వేటు వేస్తూ ఆమోదం కోసం రాష్ట్రపతికి ఫైల్ పంపింది.

ఇక్కడే ఇసి నిర్ణయంపై అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణా ప్రభుత్వం కూడా ఆరుగురు ఎంఎల్ఏలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించింది. అయితే సదరు నియామకం చెల్లదంటూ కొందరు కోర్టులో కేసు వేశారు. పిటీషన్ ను విచారించిన కోర్టు ఎంఎల్ఏలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియామకం చెల్లదంటూ తీర్పు చెప్పింది. ప్రభుత్వం కూడా ఆరుగురి నియామకాలను వెనక్కు తీసుకుంది. అంతేకానీ ఎంఎల్ఏలను అనర్హులుగా కోర్టు ప్రకటించలేదు.

ఇక, రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఫిరాయింపుల విషయాన్నే పరిశీలిద్దాం. కాంగ్రెస్, టిడిపి, వైసిపి తరపున గెలిచిన ఎంఎల్ఏలు, ఎంపిలను కెసిఆర్, చంద్రబాబునాయుడు యధేచ్చగా ఫిరాయింపులకు ప్రోత్సహించారు. ఫిరాయింపులపై పై పార్టీలు కోర్టుల్లో కేసులు కూడా వేశాయి. అయినా ఇంత వరకూ దిక్కు మొక్కులేదు. కోర్టుల్లో కేసులు తేలకపోతే ఎన్నికల కమీషన్ కు కూడా ఫిర్యాదులు చేశాయి. అయినా ఫిర్యాదులను పట్టించుకున్న నాధుడే లేడు.

ఫిరాయింపులను ప్రోత్సహించిన కెసిఆర్, చంద్రబాబులపైన కానీ లేదా ఫిరాయింపులకు పాల్పడ్డవారిపైన కానీ ఇంత వరకూ ఏ వ్యవస్ద కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం ఢిల్లీలో ఎంఎల్ఏలపై అనర్హత వేటు వేసిన ఎన్నికల సంఘానికే ఏపి, తెలంగాణాలో బాధిత పార్టీలు ఫిర్యాదులు చేసాయి. అయినా ఇక్కడి ఫిర్యాదులపై ఏ విధమైన చర్యలు తీసుకోని ఇసి ఢిల్లీలో ఆప్ ఎంఎల్ఏలపైన మాత్రం ఆఘమేఘాలపై కఠిన చర్యలు తీసుకోవటాన్నే అందరూ అనుమానిస్తున్నారు.

పైగా ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఎంఎల్ఏలను అనర్హులుగా చేయటమంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమే. క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్న ప్రజాప్రతినిధులున్నారు. వందల కోట్ల బ్యాంకు రుణాలను ఎగవేసిన వారు ఎంఎల్ఏలు, ఎంపిలు, కేంద్రమంత్రులుగా దర్జాగా తిరుగుతున్నారు. వారి విషయంలో లేని అభ్యంతరాలు పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమితులయ్యారన్న ఏకైక కారణంతో అనర్హులుగా చేయటమంటే ఆశ్చర్యంగా ఉంది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page