అధిక వడ్డీల పేరుతో వంచన చేసిన ఘటనలో ఏజెంట్ బట్టా మహేంద్ర చౌదరిని అరెస్ట చేశామని ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ తెలిపారు. అతని నుండీ కారు, ల్యాప్ టాప్ , సి.పి.యు. కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. శుక్రవారం ఆయన ధర్మవరం రూరల్ సి.ఐ చిన్న పెద్దయ్య, ఎస్సై ప్రదీప్ లతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఆ వివరాల ప్రకారం... రామగిరి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన సునీల్ కడియాల, సంతోష్ కుమార్ కడియాల ఇద్దరూ అన్నదమ్ములు. సునీల్ కడియాల భార్య స్వాతి బాయి అలియాస్ స్రవంతి అనంతపురములో ఈబిఐడిడి ట్రైడర్స్ కంపెనీని ప్రారంభించారు. సదరు కంపెనీలో సునీల్ కడియాల, సంతోష్ కుమార్ కడియాల డైరెక్టర్లు గా వున్నారు. 

స్వాతి బాయి అలియాస్ స్రవంతి కోశాధికారిగా ఉంటున్నారు. ఈ కంపెనీలో ధర్మవరం మండలం చింతలపల్లికి చెందిన బట్ట మహేందర్ చౌదరి అలియాస్ మహి (37) ను జిల్లా ఏజెంట్ గా చేర్చుకున్నారు. ఈ కంపెనీ షేర్ మార్కెట్ కి సంభంధించినదని... ఆఫ్ లైన్ ట్రేడింగ్ అని నమ్మబలికారు. 

ఒక షేర్ విలువ రూ. 2,500/- రూపాయలు అని...ఒక షేర్ కొంటే ఒక నెలకు 2500+1200 = రూ. 3,700/- రూ,,లు తిరిగి చెల్లిస్తామని ఏజెంట్ లతో చెప్పారు. బట్టా మహేంద్ర చౌదరి 2019 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు ఏజెంట్ గా పనిచేస్తూ అతని కింద అతని బావమరిది సుధాకర్ నాయుడు,  ఇంకా 6 మంది వ్యక్తులను ఏజెంట్లుగా చేర్చుకుని ధర్మవరం రూరల్ మండలములో చింతలపల్లి, వసంతపురము, ముదిగుబ్బ, రామ గిరి, అనంతపురము టౌన్, తాడిమర్రి, తాడిపత్రి, అనంతపురం జిల్లాలో పలుచోట్ల చాలా మంది కస్టమర్లతో  ఈబిఐడిడి ట్రైడర్స్ కంపెనీ పేరుతో.. సుమారు 40 కోట్ల రూపాయలు డిపాజిట్ రూపం లో వసూలు చేశారు. 

అప్పటి నుండి సునీల్,  అతని భార్య స్వాతి బాయి అలియాస్ స్రవంతి, మహేంద్ర చౌదరి డిపాజిటర్లకు డబ్బులు ఇవ్వకుండా వారి సొంత ఖర్చులకు వాడుకుంటూ డిపాజిటర్ల డబ్బులు అడిగిన ప్రతిసారి కంపెనీలో ఆడిటింగ్ జరిగిన తరువాత ఇస్తామని చెప్పి నమ్మబలికి తప్పించుకుని తిరిగేవాళ్లు.  

తరువాత వీరి పైన,  వీరి కంపెనీ పైన ధర్మవరము రూరల్ పోలీసు స్టేషన్, జిల్లాలో పలు పోలీసు స్టేషన్ లలో పోలీసులు కేసులు రిజిస్టర్ చేసినారని తెలిసి సునీల్, సంతోష్ కుమార్ లు నాగపూర్ కు పారిపోయినారు.  మహేంద్ర చౌదరి  కూడా ఈరోజు బెంగళూరుకు పారిపోయి అక్కడనే తలదాచుకోవాలనే ఉద్దేశ్యముతో బయలుదేరి పోతూ మామిళ్లకుంట క్రాస్ వద్ద వుండగా పట్టుకుని అరెస్టు చేశామన్నారు. అతని దగ్గర్నుండి కారు, ల్యాప్ టాప్ , సి.పి.యు. కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.