విజయవాడ: గన్నవరం శాసనసభ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ (వైసీపీ)లోని ఇరు వర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. టీడీపీ నుంచి విజయం సాధించి వైసీపీకి దగ్గరైన శాసనసభ్యుడు వల్లభనేని వంశీకి దుట్టా రామచంద్ర రావు నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదరవుతోంది. 

తాజా రాజకీయ పరిణామాలపై వైసిపి నేత దుట్టా రామచంద్రరాబు స్పందించారు. పదేళ్ల నుంచి తాను పార్టీ జెండా మోస్తున్నట్లు ఆయన చెప్పారు. ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా సహించేది లేదని ఆయన అన్నారు. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నవారికి మాదిరిగానే కొత్తగా చేరిన వారు కూడా పార్టీ కోసం పనిచేయాలని, అంతే కాని పెత్తనం చేస్తే సహించేది లేదని ఆయన అన్నారు. 

యార్లగడ్డ వెంకట్రావు కోసం అహర్నిశలు పనిచేసినట్లు, కానీ ఆయన అగ్రవర్ణాలవారికి సొసైటీ బ్యాంక్ అధ్యక్ష పదవులు కట్టబెట్టి బీసీ కులాలను పక్కన పెట్టారని, దాంతో యార్లగడ్డతో విభేదించినట్లు దుట్టా రామచంద్రరావు చెప్పారు. సొసైటీ బ్యాంకు పదవుల విషయంలో తప్ప యార్లగడ్డతో విభేదాలు లేవని ఆయన చెప్పారు. 

పార్టీ స్థాపించినప్పటి నుంచి వైసీపీలో ఉన్నామని, వైఎస్ రాజశేఖర రెడ్డితో 30 ఏళ్ల అనుబంధం ఉందని ఆయన చెప్పారు. ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని దుట్టా రామచంద్రరావు వర్గీయులు కలిసి గన్నవరం టికెట్ తమకే ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.