భార్య కాపురానికి రావడంలేదని ఓ అల్లుడు అత్తను హతమార్చిన దారుణ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. మాటామాటా పెరగడంతో ఓ వ్యక్తి తన అత్తమీద కొడవలితో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. శుక్రవారం చెన్నంపల్లి గ్రామంలో జరిగిన ఈ హత్య వివరాల్లోకి వెడితే...

చెన్నంపల్లి గ్రామానికి చెందిన హుసేన్ బీ (55) కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఆమెకు ముగ్గురు కూతుర్లు. అందరికీ వివాహాలు చేసింది. అయితే రెండో కూతురు షేకున్ బీని నార్పలకు చెందిన మహబూబ్‌బాషాకిచ్చి పదేళ్ల క్రితం పెళ్లి చేసింది. 

పెళ్ళైన కొద్దిరోజులు బాగానే ఉన్నా ఆ తరువాత మద్యానికి బానిసైన మహబూబ్‌బాషా రోజూ భార్యను వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో వేదింపులు ఎక్కువ కావడంతో హుసేన్ బీ రెండురోజుల క్రితం కూతుర్ని తన గ్రామమైన చెన్నంపల్లికి తీసుకువచ్చింది.

దీంతో ఆగ్రహానికి వచ్చిన మహబూబ్ బాషా శుక్రవారం సాయంత్రం బాగా మద్యతాగి చెన్నంపల్లి వచ్చాడు. భార్యను ఇంటికి పంపించాలంటూ అత్తతో గొడవకు దిగారు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. రెచ్చిపోయిన మహబూబ్ బాషా వెంట తెచ్చుకున్న కొడవలితో అత్తమీద దాడికి దిగాడు. 

ఈ దాడిలో హుసేన్ బీ తలకు, చేతులకు గాయాలై తీవ్ర రకస్రావం అయ్యింది. అది చూసి భయపడ్డ మహబూబ్ బాషా అక్కడ్నుండి పరారైపోయి నేరుగా నార్పల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. 

కొన ఊపిరితో ఉన్న హుసేన్ బీని స్తానికులు 108 వెహికిల్ లో అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ, మృతి చెందింది. నార్పల పోలీసులు నిందితున్ని బుక్కరాయల సముద్రం పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై కేసు నమోదు చేసుకుని  దర్యాప్తు చేస్తున్నారు.