పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించి.. మంచి ఏదో.. చెడు ఏదో చెప్పాల్సిన ఉపాధ్యాయుడే దారి తప్పాడు. పాఠశాలలోనే ఏకంగా దుకాణం పెట్టి.. మద్యం సేవించాడు. పైగా విద్యార్థుల తల్లిదండ్రులను బూతులు తిట్టాడు. ఆయన అలా చేస్తుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. దీంతో.. సదరు ఉపాధ్యాయుడిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పాకాల మండలం కృష్ణాపురం మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఏకోపాధ్యాయుడిగా పనిచేస్తున్న కోటేశ్వర రావు గురువారం పాఠశాలలోనే మద్యం సేవిస్తూ బిరియాని తింటుంటడం గమనించిన పిల్లల తల్లిదండ్రులు వీడియో తీశారు. అయినప్పటికీ మేలుకోని ఆయన దుస్తులు విప్పుతా తీసుకుంటారా అంటూ అసభ్యకరంగా మాట్లాడాడు. 

వీడియో తీసుకోండంటూ మద్యం బాటిల్‌, బిరియాని పైకెత్తి మరీ చూపించాడు. నిత్యం మద్యం మత్తులో విధులకు హాజరై చిన్న చిన్న విషయాలకే విద్యార్ధుల దుస్తులు విప్పి పైశాచికంగా ప్రవర్తిస్తున్న కోటేశ్వరరావుపై అప్పటికే ఆగ్రహంగా వున్న తల్లిదండ్రులు ఆ వీడియోను విద్యాశాఖ ఉన్నతాధికారులకు పంపించారు. విజయనగరం జిల్లాకు చెందిన కోటేశ్వర రావు గతంలో కుప్పంలో పని చేసినప్పుడు కూడా ఇలాగే తాగి పాఠశాలకు హాజరయ్యే వాడని సమాచారం.

రెండు నెలలక్రితం బదిలీపై కృష్ణాపురం పాఠశాలకు వచ్చిన ఈయన వ్యవహార శైలి మొదటి నుంచి అలాగే వుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో కోటేశ్వర రావును విధులనుంచి తాత్కాలికంగా తొలగించినట్లు డీఈవో నరసింహా రావు ప్రకటించారు.