ప్రశ్నకు తగ్గ సమాధానం చెప్పటం చంద్రబాబు డిక్షనరీలోనే ఉన్నట్లు కనబడదు.

ప్రశ్నలకు సమాధానాలు చెప్పటంలో చంద్రబాబునాయడు రూటే సపరేటు. ఏ ప్రశ్నకైనా, వేదిక ఏదైనా సరే తన సహజ ధోరణిలోనే సమాధానం చెబుతారు. అంతే తప్ప ప్రశ్నకు తగ్గ సమాధానం చెప్పటం చంద్రబాబు డిక్షనరీలోనే ఉన్నట్లు కనబడదు. మచ్చుకి కొన్ని ప్రశ్నలు.

తాజాగా, ఢిల్లీలో ఓ ప్రముఖ దినపత్రిక ఆధ్వర్యంలో జరిగన ఓ ఘోష్టిలో ప్రసంగించటానికి చంద్రబాబు హాజరయ్యారు. అదే సందర్భంగా చర్చా వేదిక కూడా జరిగింది. అందులో పలువురు సంధించిన ప్రశ్నల్లో వేటికి కూడా చంద్రబాబు నేరుగా సమాధానాలు చెప్పకపోవటం పలువురిని ఆశ్చర్యపరిచింది. అంతేకాకుండా కొన్ని సమాధానాలు వాస్తవానికి దూరంగా కూడా ఉన్నాయి.

1-భాజపాతో చంద్రబాబు సహచర్యమెలా ఉంది?

ఎన్నికల్లో కలిసే పోటీచేసాం. టిడిపి వాళ్లు కేంద్రమంత్రివర్గంలోను, భాజపా వాళ్లు తన మంత్రివర్గంలోను ఉన్నారు. ఇదొక సంక్షోభం, ఇదే అవకాశం.

2-కేంద్రం నుండి కోరుకున్నంత మద్దతు అందుతోందా?

ఇది నిరంతర ప్రక్రియ. విభజన చట్టంలో కొన్ని హామీలు, రాజ్యసభలో కొన్ని హామీలు ఇచ్చారు. కొన్ని అమలయ్యాయి. మరికొన్ని అమలు కావాలి.

3-గత 15 ఏళ్ళుగా మీరు డిజిటల్ డిజిటల్ అంటున్నారు. ఇపుడు కేంద్రం మిమ్మల్ని అనుసరిస్తోందా?

పెద్దనోట్ల రద్దు-డిజిటల్ లావాదేవీలపై ఏర్పాటు చేసిన కమిటికి నన్ను కన్వీనర్గా నియమించింది. ఒక వీడియో కాన్ఫరెన్స్ జరిపాం. మరోసారి సమావేశమై ఈ అంశాన్ని చర్చించాలి.

ఒకవేళ రేపు మీరు ఓడిపోతే...మరో పార్టీ వస్తే మీ ప్రణాళికలన్నీ మార్చే ప్రమాదం ఉంది కదా?

అందుకే మేం నిరంతరాయంగా గెలుస్తూ ఉండాలి. నాపై నమ్మకంతో హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టారు. తర్వాత పరిస్ధితులు మారటంతో ఇబ్బందులు పడ్డామని వారే చెప్పారు. గతంలో మంచి ప్రయోగం చేశాను. కానీ అప్పుడు కాలం కంటే ముందున్నాను. ఈసారి దీర్ఘకాలిక, స్వల్పకాలిక ప్రణాళికలు, సంక్షేమం, అభివృద్ది అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ప్రజల్ని నా పక్షాన ఉంచుకోవాలనుకుంటున్నాను.

4-గతంలో హైదరాబాద్ నిర్మించారు. ఇపుడు అమరావతి నిర్మిస్తున్నారు. గర్వంగా ఉంటుందా? (హైదరాబాద్ ను చంద్రబాబు నిర్మించటమేమిటో)

నా జీవితంలో ఆనందించే విషయం అదే. హైదరాబాద్ విమానాశ్రయాన్ని చూసినప్పుడల్లా దీన్ని నేనే నిర్మించానని అనుకుంటారు. శంషాబాద్ విమానాశ్రయం నిర్మితమైది వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో(2005-2008) అని అందరూ అనుకుంటున్నారు. కానీ తానే నిర్మించానని చంద్రబాబు చెప్పుకుంటున్నారు.

 సైబరాబాద్ వెళ్లి అక్కడి భవనాలను చూసి గర్వపడుతుంటాను. ఇపుడు ఐటి అంటే ప్రజలు హైటెక్సిటీనే చూపిస్తారు. హైదరాబాద్ను తన బ్రైన్ చైల్డ్ గా చంద్రబాబు చెప్పుకుంటున్నారు.