నెల్లూరు: నెల్లూరు జిల్లా ఉదయగిరిలో స్టాఫ్ నర్సుపై లైంగిక దాడికి ప్రయత్నించిన వైద్యాధికారి రవీంద్ర ఠాగూరుపై బాధితురాలి బంధవులు దాడి చేశారు.  ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా రవీంద్రనాథ్ ఠాగూరు పనిచేస్తున్నాడు.  ఈ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా  మంగళవారం నాడు విధులు ముగించుకొని  ఇంటికి వెళ్లింది. ఆసుపత్రి పక్కనే ఆమె నివాసం ఉంటుంది.

మంగళవారం నాడు రాత్రి ఆమెకు ఫోన్ చేసి ఆమ్లెట్ వేసుకొని తన గదికి రావాలని స్టాఫ్ నర్సును డాక్టర్ రవీంద్రనాథ్ కోరాడు.  అటెండర్ ను పంపాలని ఆమె కోరింది. అయితే ఏవో సాకులు చెప్పి ఆమ్లెట్ తీసుకురావాలని ఆమెను కోరాడు. ఇక చేసేదిలేక ఆమె ఆమ్లెట్ వేసుకొని డాక్టర్ గదికి వెళ్లింది.

డాక్టర్ గదిలోకి ఆమ్లెట్ తీసుకొని ఆమె వెళ్లగానే గది తలుపు పెట్టి ఆమెపై అతను లైంగిక దాడికి ప్రయత్నించాడు. తనతో గడపాలని కోరాడు. తాను ప్రాధేయపడినా కూడ ఆయన వినలేదని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆ తర్వాత తనకు ఫోన్ వచ్చిందని చెప్పి ఆమె అక్కడి నుండి ఇంటికి చేరుకొంది. విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పింది. బుధవారం నాడు కుటుంబసభ్యులు ఆసుపత్రికి చేరుకొని డాక్టర్ రవీంద్రనాథ్ ను బయటకు పిలిచి చితక్కొట్టారు.