టీడీపీ  సీనియర్ నేత ఆనం వివేకానంద రెడ్డి బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

ప్రజలను ఆకట్టుకోవడంలో,  ఎక్కడున్నా తనదయిన శైలిని ప్రదర్శించడంలో మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. జనంతో మమేకం కావడంలో తెలుగు నాట ఆయనకు మించిన రాజకీయ నేత మరొకరు లేరు. జనంలో కలిసేపోయేందుకు ఎన్నివేషాలు వేసే వారో లెక్కలేదు. బైక్‌పై జామ్మని దూసుకెళ్లాడు, పబ్లిక్‌లో సిగెరట్ విలాసంగా  కాల్చడం, చీర సింగారించుకోవడం, మీసాలు ప్రదర్శించడం...పాటలు పాడటం, డ్యాన్స్ వేయడం...ఇవన్నీ కొన్ని అవతారాలు మాత్రమే...
 

ఎవరినీ లెక్క చేయకపోవడం ఆయనకు మరొక నైజం. తిట్టడం మొదలుపెడితే కూడా అంతే, ఎవరూసాటిరారు. ఆయన కనిపించక పోతే, రాజకీయ సందడే ఉండదు. అలాంటి వివేకా.. బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం.. రాజకీయాలకు పెద్ద లోటు అనే చెప్పవచ్చు. అయితే.. ఆయన తన ఆఖరి కోరిక తీరకుండా చనిపోయారని ఆయన కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకీ ఆనం చివరి కోరిక ఏంటో తెలుసా... తాను పోయేటప్పుడు ఎమ్మెల్సీ పదవిలో ఉండాలని
కోరుకునేవారట. ఈ మాట తరచూ తన సోదరుడితో, అనుచరులతో చెబుతుండేవాడని తెలిసింది. పాపం చివరి కోరిక తీరకుండానే కన్నుమూశారని ఆయన అభిమానులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.