చంద్రబాబుకు పరువు సమస్య

First Published 13, Feb 2018, 2:04 PM IST
Do or die situation for chandrababu
Highlights
  • మూడున్నరేళ్ళుగా ప్రత్యేకహోదా, రాష్ట్రప్రయోజనాల కోసం జగన్ ఆందోళనలను, దీక్షలు, నిరసనలు తెలిపినపుడు చంద్రబాబు, టిడిపి నేతలు హేళనగా మాట్లాడేవారు.

వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడవాల్సి వస్తుందని చంద్రబాబునాయుడు ఎప్పుడూ అనుకుని ఉండరు. మూడున్నరేళ్ళుగా ప్రత్యేకహోదా, రాష్ట్రప్రయోజనాల కోసం జగన్ ఆందోళనలను, దీక్షలు, నిరసనలు తెలిపినపుడు చంద్రబాబు, టిడిపి నేతలు హేళనగా మాట్లాడేవారు. కానీ అవే డిమాండ్లను ఇపుడు చంద్రబాబు అండ్ కో అవే డిమాండ్లు వినిపిస్తున్నారు. అప్పటి జగన్ డిమాండ్ ను చంద్రబాబు పట్టించుకోలేదు. ఇప్పటి చంద్రబాబు డిమాండ్లను కేంద్రం పట్టించుకోవటం లేదంతే.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. అదేమిటంటే, వేగంగా మారిపోతున్న రాజకీయ పరిణామాల్లో చంద్రబాబునాయుడు ఒంటరైపోయారు. ఇంతకాలం మిత్రపక్షంగా ఉన్న బిజెపినే వైరిపక్షంగా మారిపోవటంతో చంద్రబాబుకు ఏమి చేయాలో దిక్కుతోచటం లేదు. ప్రతిపక్షం వైసిపి లాగ మిత్రపక్షం బలహీనం కాదు. చాలా వపర్ ఫుల్లు. ఎంతగా అంటే బడ్జెట్ ప్రవేశపెట్టి 13 రోజులైనా, ఏపికి అన్యాయం జరిగిందని రాష్ట్రంలోను, పార్లమెంటులోనూ నానా గొడవ జరుగుతున్నా చంద్రబాబు మాత్రం మీడియా ముందుకు ఒక్కసారి కూడా రాలేదు. బడ్జెట్ పై తన అభిప్రాయాలను ఒక్కసారి కూడా నేరుగా మీడియాలో పంచుకోలేకున్నారు.

మారిన రాజకీయ పరిస్ధితుల్లో ఒకవైపు బిజెపి చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని ఎదురుదాడులు చేస్తోంది. ఇంకోవైపు వైసిపి, వామపక్షాలు, కాంగ్రెస్ ఒత్తిడి పెంచుతున్నాయ్. అదే సమయంలో కేంద్రమేమో పట్టించుకోవటం లేదు. దాంతో సమస్య నుండి ఎలా బయటపడాలో చంద్రబాబుకు అర్ధం కావటం లేదు.

నిధులివ్వటం లేదని టిడిపి అంటుంటే, ఇవ్వాల్సినదానికన్నా ఎక్కువే ఇచ్చామని బిజెపి చెబుతోంది. విచిత్రమేమిటంటే రెండు పార్టీల నేతలూ లెక్కలు చూపిస్తున్నారు. అందులో ఎవరి వాదన కరెక్టో జనాలకు అర్ధం కావటం లేదు. కాకపోతే ఒక విషయం మాత్రం అర్దమవుతోంది. కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన నిధులు పక్కదారి పట్టాయన్నది వాస్తవమని తేలిపోయింది. ఎందుకంటే, చేసిన ఖర్చులకు లెక్కలు చెప్పమంటే సిఎం చెప్పటం లేదు. అక్కడే అందరికీ చంద్రబాబు దొరికిపోతున్నారు. ఇదే విషయాన్ని గనుక కేంద్రం బాగా బిగించేస్తే చంద్రబాబుకు చుక్కలు కనబడటం ఖాయం.

loader