‘ఏ పద్దతిలో 2019కి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేద్దామని చెబుతున్నారు సార్’ అంటూ చంద్రబాబునే నిలదీసారు. తన లెక్క ప్రకారం పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వటం కష్టమన్నారు.

వేరే గతిలేకే తెలుగుదేశం పార్టీలో చేరానని అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అది కూడా చంద్రబాబునాయుడు సమక్షంలోనే. అనంతపురం పర్యటనలో చంద్రబాబు ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా జెసి తనదైన శైలిలో మాట్లాడారు. 2019కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తానని చంద్రబాబు చెప్పటాన్ని తప్పుపట్టారు. ‘ఏ పద్దతిలో 2019కి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేద్దామని చెబుతున్నారు సార్’ అంటూ చంద్రబాబునే నిలదీసారు. తన లెక్క ప్రకారం పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వటం కష్టమన్నారు.

మొన్ననే కోట్లాది రూపాయల విలువైన యంత్రసమాగ్రి కాలిపోయిందని వేలాదిమంది పనివాళ్ళు పనిచేయాలని కూడా జెసి తెలిపారు. కాలిపోయిన యంత్రసామగ్రిని తెప్పించటానికే కనీసం మూడు మాసాలు పడుతుందన్నారు. ప్రాజెక్టుల కోసం కలలు కనటంలో తప్పు లేదుకానీ మరీ పగటి కలలు కంటున్నట్లుందన్నారు. అదే సమయంలో భవిష్యత్ తరాల కోసం మళ్ళీ చంద్రబాబునే గెలిపించాలని సలహా కూడా పడేసారండోయ్.

సరే, బహిరంగ సభ అన్నాక జగన్ను తిట్టకుండా వదిలిపెట్టరు కదా? జగన్ గురించి వేదికపైనే అనుచిత వ్యాఖ్యలు చేసారు. తరువాత తప్పైతే వాటిని ఉపసంహరించుకుంటున్నట్లు కూడా ప్రకటించారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయి కుళ్లి కంపు కొడుతుంటే వాసన భరించలేక పార్టీలో నుండి బయటకు వచ్చేసినట్లు చెప్పారు. పార్టీ నుండి బయటకు వచ్చేసిన తర్వాత ఎటు వెళ్ళాలో తెలీక జగన్ వైపు చూసారట. అయితే, అక్కడ ఏం లేదని తెలుసుకుని వేరే దారి లేక తెలుగుదేశంపార్టీలో చేరానంటూ చెప్పుకొచ్చారు. పైగా తనకు కుల పిచ్చి లేదని కూడా చెప్పుకున్నారు. మొత్తానికి జెసి తనదైన శైలిలో చంద్రబాబును పొగిడారో తిట్టారో కూడా అర్ధం కాకుండా మాట్లాడారు.