కర్నూలు జిల్లా వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మధ్య ప్రస్తుతం కోల్డ్ వార్ నడుస్తోంది.

తనతో చెప్పకుండా ఎస్వీ మోహన్ రెడ్డి కార్యకర్తలను చేర్చుకోవడంతో హఫీజ్ మండిపడుతున్నారు. ఒక్క మాటైనా చెప్పకుండా ఎస్వీ ఇలా చేయడమేంటని ఆయన బహిరంగంగానే అక్కసు వెళ్లగక్కినట్లుగా తెలుస్తోంది.

Also Read:రంగంలోకి ఈడీ: అమరావతి భూముల కొనుగోలు‌పై కేసు

దమ్ముంటే పత్తికొండ, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలకు చెప్పకుండా మిగిలిన పార్టీల వారిని వైసీపీలోకి చేర్చుకోవాలని మోహన్ రెడ్డికి హాఫీజ్ సవాల్ విసిరారు. ఈ వ్యవహారంతో మీడియాతో మాట్లాడిన ఆయన ఎస్వీ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

తనను కొట్టండి తాను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను కానీ తమ కార్యకర్తల జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకునేది లేదని ఆయన వార్నింగ్ ఇచ్చారు. తమ కార్యర్తలపై దాడులకు దిగితే.. చూస్తూ ఊరుకునేది లేదని, వారికి అండగా ఉంటామని హాఫీజ్ స్పష్టం చేశారు. కర్నూలును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని సీఎం నాతో చెప్పారని అది జగన్ మంచితనానికి నిదర్శనమని హాఫీజ్ వ్యాఖ్యానించారు.

Also Read:కర్నూలుకు కార్యాలయాల తరలింపు: హైకోర్టులో సవాల్ చేసిన రైతులు

2014 ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎస్వీ మోహన్ రెడ్డి తదనంతరం కాలంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత 2019 అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు తిరిగి సొంత గూటికి చేరారు. ఆ సమయంలో టికెట్ ఆశించిన ఆయనకు వైసీపీ హైకమాండ్ షాకిచ్చి, ఎమ్మెల్యే అభ్యర్ధిగా ముందు నుంచి అనుకున్న హాఫీజ్‌కే టికెట్ కేటాయించింది.

ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి నేటి వరకు వీరిద్దరి మధ్య పలు విషయాల్లో విభేదాలు రావడంతో ఎన్నోసార్లు అధిష్టానం వద్దకు వెళ్లింది. ఇద్దరు నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో కార్యకర్తలు, నాయకులు ఆందోళన చెందుతున్నారు. వీరి వ్యవహారంపై హైకమాండ్ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే.