కర్నూలు ఫిరాయింపు ఎంపి బుట్టా రేణుకపై వేటు పడటం ఖాయమేనా? అవుననే అంటున్నాయి కేంద్రప్రభుత్వ వర్గాలు. కాకపోతే వైసిపి తరపున గెలిచి టిడిపిలోకి ఫిరాయించినందుకు కాదు వేటు పడుతున్నది. ఎంపిగా ఉంటూ లాభదాయక పదవుల్లో కొనసాగుతున్నందుకట. ఇంతకీ విషయం ఏమిటంటే, లోక్ సభ సభ్యురాలిగా ఉన్న బుట్టా కేంద్ర, మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలోని కేంద్రం సాంఘిక సంక్షేమ బోర్డు జనరల్ బాడి సభ్యులలో ఒకరట. వాస్తవానికి జనరల్ బాడిలో ఒక ఛైర్ పర్సన్ తో పాటు వివిధ రంగాల్లో ప్రముఖులు, కేంద్రప్రభుత్వ ఉన్నతాధికారులుంటారు. అయితే, జనరల్ బాడిలో ఎంపిలైన బుట్టా రేణుక, రావత్ లను కేంద్రమహిళా శిశుసంక్షేమ సంఘం నియమించింది.

ఆ నియామకమే ఇపుడు  బుట్టా కొంపముంచుతోంది. పార్లమెంటరీ కమిటి అధ్యయనంలో ఎంపిలున్నది లాభదాయక పదవులని తేలింది. దాంతో ఎంపిలుగా వారిద్దరిపై అనర్హత వేటు వేయాలంటూ కమిటీ సిఫారసు చేసేసింది. ఈ సిఫారసును మహిళా శిశు సంక్షేమ శాఖ న్యాయశాఖ అభిప్రాయం కోసం పంపింది. అభిప్రాయం రాగానే వేటుపై నిర్ణయముంటుంది.

ఇదే విషయమై బుట్టా మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వమే తనంతట తానుగా తనను బోర్డులో నియమించిందన్నారు. నియామకం గురించి తానుగా ఎవరినీ కోరలేదని స్పష్టం చేశారు. తనపై వేటుకు కమిటి సిఫారసు చేసిన విషయం తనకు తెలియదన్నారు. ఈ మధ్యనే తనను ఆరోగ్యశాఖకు చెందిన మరో కమిటీలో కూడా సభ్యురాలిగా నియమించిన విషయాన్ని బుట్టా చెప్పారు. మహిళా శిశు సంక్షేమ బోర్డులో తనను తొలగించి ఆరోగ్యశాఖ సంబంధించిన బోర్డులో నియమించారా లేకపోతే రెండింటిలోనూ సభ్యురాలినేనా అన్న విషయంలో తనకే స్పష్టత లేదన్నారు. మొత్తం మీద ఫిరాయింపుకు అనర్హత వేటు పడాల్సింది పోయి లాభదాయక పదవుల్లో ఉన్నందుకు అనర్హత వేటుకు గురి కావాల్సి వస్తుందేమో?