భార్యతో గొడవపడిన భర్త ప్రాణాలు కాపాడిన దిశ పోలీసులు...
భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి గోదావరి నదిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా దిశ పోలీసులు కాపాడారు.
యమమంచిలి : కేవలం మహిళలనే కాదు ప్రతి ఒక్కరి సంరక్షణ తమ బాధ్యత అని దిశ పోలీసులు నిరూపించారు. ఆపదలో వుంటే పురుషులకు కూడా అండగా వుంటామని తెలియజేసారు. ఇలా దిశ పోలీసులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగుచూసింది.
దిశ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ నుండి రాజోలు వెళుతున్న సునీల్ కుమార్ గోదావరి బ్రిడ్జిపై ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తచ్చాడుతుండటం గమనించాడు. వెంటనే తన కారు ఆపిన సునీల్ ఆ వ్యక్తి బ్రిడ్జి పైనుండి గోదావరి నదిలోకి దూకేందుకు ప్రయత్నించడం చూసాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతడివద్దకు వెళ్లి నదిలోకి దూకకుండా అడ్డుకున్నాడు.
అంతకు ముందే సునీల్ పోలీసులకు సమాచారం అందించాడు. అయితే ఘటనాస్థలికి దగ్గర్లో యలమంచిలి దిశ పోలీస్ స్టేషన్ వుండటంతో అక్కడి సిబ్బందికి కంట్రోల్ రూం నుండి సమాచారం అందింది. కేవలం ఐదు నిమిషాల్లోపే దిశ పోలీసులు ఘటనాస్థలికి చేరుకోగా అప్పటివరకు ఆత్మహత్యాయత్నాన్ని సునీల్ అడ్డుకున్నాడు.
Read More మహిళ గొంతులో ఇరుక్కుపోయిన టూత్ బ్రష్.. భర్త మొహంపై కొట్టడంతో...
దిశ పోలీసులు ఆత్మహత్యను అడ్డుకున్న సునీల్ ను అభినందించారు. ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి ప్రశ్నించగా భార్యతో గొడవ కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. వెంటనే అతడి భార్యను పోలీస్ స్టేషన్ కు పిలిపించిన దిశ పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం భార్యాభర్తలిద్దరినీ స్టేషన్ నుండి పంపించారు.
దిశ పోలీసుల స్పందించిన తీరు తనను చాలా ఆకట్టుకుందని సునీల్ తెలిపారు. కేవలం ఐదు నిమిషాల్లోపే వారు ఘటనాస్థలికి చేరుకున్నారని తెలిపాడు. ఒకవేళ ఆలస్యం జరిగివుంటే ఆత్మహత్యను ఆపడం సాధ్యమయ్యేది కాదన్నాడు. దిశ పోలీసులు పనితీరు అద్భుతంగా వుందని సునీల్ కొనియాడాడు.