మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నారు ఓ మహానుభావుడు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఇది అక్షరాలా నిజమనే భావన కలుగుతోంది. మరో పది నిమిషాల్లో హాయిగా.. పెళ్లిపీటలు ఎక్కి వివాహ బంధంలోకి అడుగుపెట్టాల్సిన జంట.. కేవలం రూ.3వేల కోసం.. పెళ్లి కాదనుకొని చెరోదారిన వెళ్లిపోయారు.

చిత్తూరు జిల్లా పలమనేరులో ఈ ఘటన జరిగింది. కొన్ని గంటల్లో మాంగల్య బంధంతో ఒక్కటి కావలసిన వధూవరులు పెళ్లి వద్దనుకొని వెళ్లిపోవడం గమనార్హం. పుంగనూరు నియోజకవర్గానికి చెందిన యువతికి పలమనేరు పట్టణానికి చెందిన యువకుడికి పెద్దలు వివాహం నిశ్చయించారు. ఆదివారం ఉదయం పెళ్లి ముహూర్తం సమయంలో వేలి ఉంగరం ఇవ్వాలని పెళ్లి కుమారుడి బంధువులు పురమాయించారు. 

అయితే తమ దగ్గర గతంలో తీసుకున్న అప్పు రూ.3 వేలు తిరిగి ఇస్తేనే ఉంగరం ఇస్తామని పెళ్లి కుమార్తె బంధువులు మొరాయించారు. అలా ప్రారంభమైన వివాదం ఇరువర్గాలు కొట్టుకునే దాకా వెళ్లింది. రూ.మూడు వేలకు వివాదం సృష్టిస్తావా అంటూ పెళ్లికొడుకు, పెళ్లి కుమార్తె వాదులాడుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. మధ్యవర్తులు నచ్చజెప్పినా ప్రయోజనం లేకపోయింది.

 

read more news..

నాలుగో పెళ్లికి సిద్దపడిన భర్త: ధర్నాకు మూడో భార్య