హైదరాబాద్: తన భర్త  మరో పెళ్లికి సిద్దపడ్డాడని ఆరోపిస్తూ భార్య  ఆమె కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన సరూర్‌నగర్‌లోని  భార్యగనర్‌లో చోటు చేసుకొంది.  అయితే ఈ విషయాన్ని తెలుసుకొన్న  భర్త కుటుంబసభ్యులు  ఇంటికి తాళం వేసి  పారిపోయారు.

హైద్రాబాద్‌ సరూర్‌నగర్‌ భాగ్యనగర్‌ కాలనీలో నివాసం ఉండే  కృష్ణ, భారతి దంపతుల కొడుకు శ్రీనివాస్‌కు  2014 మే 23వ తేదీన కామారెడ్డిలోని శ్రీరమణారెడ్డి కాలనీకి చెందిన నారాయణ, నాగరాణి దంపతుల కూతురు అనేషతో వివాహం జరిగింది.

ఈ వివాహం సందర్భంగా  రూ. 5 లక్షల నగదు, 15 తులాల బంగారు ఆభరణాలను కానుకలుగా ఇచ్చారు.శ్రీనివాస్ యాదాద్రి భువనగరి జిల్లాలోని ఇరిగేషన్ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు.  అనూష, శ్రీనివాస్‌ల కాపురం రెండేళ్లపాటు సజావుగానే సాగింది. 

అయితే వీరికి పిల్లలు పుట్టలేదు.పిల్లలు పుట్టని కారణంగా అత్తింటివాళ్లు ఆమెను వేధించడం ప్రారంభించారు.  దీంతో అనూష సరూర్‌నగర్‌ పోలీసులను ఆశ్రయించింది.

అనూష పోలీసులను ఆశ్రయించడంతో శ్రీనివాస్ ఆమెకు విడాకుల నోటీసులు పంపారు. అయితే అనూష కంటే ముందే  శ్రీనివాస్  శ్రీనిధి,. సోని అనే మహిళలను కూడ పెళ్లి చేసుకొన్నట్టు  అనూష కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.  అంతేకాదు అనూష‌ నుండి అధికారికంగా విడాకులు పొందకముందే మరో వివాహం చేసుకోవడానికి శ్రీనివాస్ సిద్దమయ్యాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

ఆగష్టు 25వ తేదీన శ్రీనివాస్  మరో పెళ్లి చేసుకొంటున్నాడనే విషయం తెలుసుకొన్న అనూష కుటుంబసభ్యులు శ్రీనివాస్ ఇంటి ముందు ఆదివారం  నాడు ఆందోళనకు దిగారు.  అనూష్ కుటుంబసభ్యులు వస్తున్న విషయాన్ని తెలుసుకొన్న శ్రీనివాస్ కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి పారిపోయారు. తనకు న్యాయం చేయాలని అనూష డిమాండ్ చేస్తోంది.