విజయనగరం జిల్లాలోని పురాతన దేవాలయం రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహ ధ్వంసం నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష టిడిపి, బిజెపి, జనసేన పార్టీలతో పాటు హిందుత్వ సంఘాలు రామతీర్థం ఘటనపై ఆందోళనలు చేపడుతున్నాయి. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  ఇలా రామతీర్థంలో నెలకొన్న పరిస్థితులపై విజయనగరం రేంజ్ డిఐజి ఎల్ కాళిదాసు రంగారావు స్పందించారు.

''ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు, రాజకీయపార్టీ నేతలు సహకరించాలి. మతసామరస్యాన్ని కాపాడాలి. మతాల పేరిట ప్రజలను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దు'' అని డిఐజీ సూచించారు.

''విగ్రహ ధ్వంస ఘటన దర్యాప్తులో ఉంది. ఈ సమయంలో రాజకీయనేతల పర్యటన ఈ దర్యాప్తుకు అడ్డంకిగా మారింది. మతం పేరున ప్రదర్శనలు, ధర్నాలు సభలు, ప్రజలను అశాంతికి గురి చేస్థాయి. మత విద్వేషాలు సమాజంలో చీలికలను తెచ్చే అవకాశం వుంది'' అంటూ డిఐజీ రంగారావు ఆందోళన వ్యక్తం చేశారు.

ఏపీలో రాక్షస పాలన: సోము వీర్రాజు విమర్శ

రామతీర్థం కొండపైకి ర్యాలీగా వెళ్లేందుకు బీజేపీ నేతలు, కార్యకర్తలు గురువారం నాడు ప్రయత్నించడంతో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలు, నేతల మధ్య తోపులాట చోటు చేసుకొంది. ఈ ఘటనలో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సొమ్మసిల్లిపడిపోయాడు.

ఆలయానికి ర్యాలీగా వెళ్లే క్రమంలో రామతీర్థం జంక్షన్ వద్ద పోలీసులు బీజేపీ నేతలు, కార్యకర్తలను అడ్డుకొన్నారు.  ఈ సందర్భంగా పోలీసులకు బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకొంది.ఈ తోపుటాటలో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సొమ్మసిల్లిపడిపోయాడు. బీజేవైఎం నేత విష్ణువర్ధన్ రెడ్డి కూడ సొమ్మసిల్లి పడ్డాడు.కొండపై దేవాలయాన్ని చూసిన తర్వాతే తాము ఇక్కడి నుండి వెళ్తామని బీజేపీ నేతలు ప్రకటించారు.

గత ఏడాది డిసెంబర్ మాసంలో  రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. టీడీపీ చీఫ్  చంద్రబాబు నాయుడు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులు ఈ గుడిని పరిశీలించారు.ఈ ఘటనపై సీఐడీ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.