విజయనగరం: విజయనగరం జిల్లాలోని పార్వతీపురం నియోజకవర్గం వైసీపీలో సీటు చిచ్చు అగ్గిరాజేస్తోందా..? సీటు తమదే అంటే తమదేనని ఇద్దరు నేతలు పోటీపడుతున్నారు. ఎవరికి వారే పోటాపోటీగా కార్యక్రమాలు చేపడుతున్నారు కూడా. దీంతో ఇద్దరి నేతల మధ్య సీటు పోరు తారా స్థాయికి చేరింది. 

ఇంతలో వైసీపీ కీలక నేత  పార్వతీపురం అభ్యర్థిగా ఒక నేతను ప్రకటించడంతో మరో వర్గం అలకపాన్పు ఎక్కింది. అధినేత కాకుండా మీరెలా ప్రకటిస్తారంటూ మండిపడుతోంది మరో వర్గం. దీంతో పార్వతీపురం నియోజకవర్గం వైసీపీలో ముసలం నెలకొంది. 

పార్వతీపురం నియోజకవర్గం టిక్కెట్ ను జమ్మాన ప్రసన్నకుమార్, అలజంగి జోగారావులు ఆశిస్తున్నారు. జమ్మాన ప్రసన్నకుమార్ ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాన్ని సైతం వదులుకుని రాజకీయాల్లోకి దిగారు. గత ఎన్నికల్లో పార్వతీపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 

ఓటమి పాలైన తర్వాత కూడా పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే పార్వతీపురం నియోకవర్గంలో అనేక పోరాటాలు చేసి పోలీస్ కేసుల్లో ఇరుక్కున్నారు. దాదాపు 20 కేసుల్లో ఇరుక్కుని వాటిపై న్యాయపోరాటం చేస్తున్నారు. 

అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర పార్వతీపురం వచ్చేసరికి నియోజకవర్గ ఇంచార్జ్ ను మార్చేశారు. పీకే సర్వే నివేదిక ఆధారంగా జమ్మానను తప్పించి అలజంగి జోగారావును సమన్వయకర్తగా నియమించారు జగన్. దీంతో ఆనాటి నుంచి జమ్మాన ప్రసన్నకుమార్ వర్గం అలకబూనింది. 

అయితే పార్వతీపురం నియోజకవర్గంలో వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు జగన్ ఇద్దర్నీ కలిపారు. ఒకరి చేతిలో ఒకరి చెయ్యివేసి పార్టీ గెలుపుకు కృషి చెయ్యాలని సూచించారు. ఎవరికి టిక్కెట్ ఇచ్చినా ఇద్దరూ సహకరించుకోవాలని పార్టీని గెలిపించాలని ఆదేశించారు. ఎవరికి టిక్కెట్ అన్నది మాత్రం స్పష్టం చెయ్యలేదు.

ఇంతలో నిన్ను నమ్మం బాబూ కార్యక్రమంలో భాగంగా అరకు పార్లమెంట్ అధ్యక్షుడు, కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి భర్త పరీక్షిత్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్వతీపురం నియోజకవర్గంలో నిన్ను నమ్మం బాబూ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పార్వతీపురం నియోజకవర్గం అభ్యర్థిగా అలజంగి జోగారావును ప్రకటించారు. 

"

వైఎస్ జగన్ పాదయాత్రలో పార్వతీపురం నియోజకవర్గం అభ్యర్థిగా అలజంగి జోగారావును ప్రకటిద్దామని చెప్పారని చెప్పుకొచ్చేశారు. అలజంగి జోగారావు గెలుపుకు అంతా కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు. పరీక్షిత్ రాజు ప్రకటన నియోజకవర్గంలోని వైసీపీలో కాక పుట్టిస్తున్నాయి. 

అరకు పార్లమెంట్ అధ్యక్షుడు పరీక్షిత్ రాజు ప్రకటనతో జమ్మాన ప్రసన్నకుమార్ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. భవిష్యత్ కార్యచరణలో భాగంగా వైసీసీ ఎంపీటీసీలు, సర్పంచ్ లు సమావేశమయ్యారు. జమ్మాన ప్రసన్నకుమార్ ను తప్పిస్తే తాము వేరే దారి చూసుకుంటామంటూ హెచ్చరిస్తున్నారు. అధిష్టానం పునరాలోచించుకోకపోతే పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే మాజీ సర్పంచ్ ఒకరు పార్టీకి రాజీనామా చేశారు. 

"

అటు జమ్మాన ప్రసన్నకుమార్ సైతం పరీక్షిత్ రాజు ప్రకటనపై మండిపడుతున్నారు. నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించడానికి ఆయన ఎవరంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ తనతో స్వయంగా చెప్పారని సర్వే నివేదిక ఆధారంగా అభ్యర్థులను కేటాయిస్తామని చెప్పారని మరి ఇంతలో పరీక్షిత్ రాజు ఇలా ప్రకటించారంటూ మండిపడుతున్నారు. 

"

తాను పార్టీ మారే ఉద్దేశం లేదని కానీ పార్టీలో జరుగుతున్న పరిణామాలు కాస్త ఇబ్బంది కరంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. మరి పార్వతీపురం నియోజకవర్గంలో నెలకొన్న వర్గపోరుపై పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.