సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ధర్మాన ప్రసాద్ రావుకు ఎట్లకేలకు జగన్ కేబినేట్ లో స్థానం దక్కింది. ఆయన నేడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ధర్మాన ఉమ్మడి ఏపీలో పలు పర్యాయాలు మంత్రిగా పని చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కేబినెట్ లో కూడా ఆయన మంత్రిగా ఉన్నారు. 

ఆయ‌న ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గ‌త ప్ర‌భుత్వాల్లో మంత్రిగా కీల‌క ప‌ద‌వులు అనుభవించారు. ఆయ‌న‌కు ఉత్తరాంధ్ర అగ్రశ్రేణి రాజకీయనాయకుల్లో ఒక‌రిగా మంచి గుర్తింపు ఉంది. కానీ వైఎస్ జ‌గ‌న్ కేబినేట్ లో ఆయ‌నకు మొద‌టి సారి స్థానం ద‌క్క‌లేదు. ప‌దువులు ఆయ‌న‌కు కొత్త కాదు. కానీ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో ప‌ని చేసిన వ్య‌క్తికి.. కుమారుడు జ‌గ‌న్ టీంలోనూ ప‌ని చేయాల‌ని కోరిక‌గా ఉండేది. అదొక్క‌టే ఆయ‌న‌కు అసంతృప్తి. అయితే ఆ అసంతృప్తిని తీసేస్తూ రెండో సారి కేబినేట్ లో జ‌గ‌న్ ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. ఆయ‌న ఎవ‌రో కాదు సీనియ‌ర్ నాయ‌కుడు ధ‌ర్మాన ప్ర‌సాద్ రావు. 

మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన ధర్మాన ప్రసాదరావుకు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఒక ప్ర‌త్యేక స్థానం ఉంది. ధ‌ర్మాన‌కు అనేక అంశాల‌పై లోతైన విషయ పరిజ్ఞానం ఉంది. ఏ అంశానైన్నా స్పష్టంగా చెప్పగల నేర్పు ఆయ‌న సొంతం. నీటి పారుద‌ల అంశాలపై విశేషమైన అవగాహన, ప‌ట్టు ఉంది. రాజ‌కీయాల్లో కూడా ఎత్తుకుపై ఎత్తు వేయగల చతురత ఆయ‌న‌కు ఉంది. 

శాస‌న స‌భ‌లో, ఇత‌ర వేధిక‌ల‌పై ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను క్షుణ్ణంగా వివ‌రిస్తారు. వారి ఆవేద‌న‌ను కళ్లకు కట్టినట్టు తెలియ‌జేస్తారు. అందుకే ఆయ‌న‌కు ఎంద‌రో మంది అభిమానులు ఉన్నారు. ధర్మాన ప్ర‌సాదరావుకు మంత్రి పదవి ఎడ‌ప్పుడొస్తుంద‌ని ఇన్నాళ్లు వారు ఎదురు చూశారు. అయితే ఎట్ట‌కేల‌కు ఆయ‌న‌కు జ‌గ‌న్ కేబినెట్ లో స్థానం ద‌క్క‌డంతో ఎంతో సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. 

స‌ర్పంచ్ గా రాజకీయ ప్ర‌యాణం మొద‌లు..
నేడు మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన ధ‌ర్మాన ప్ర‌సాద్ రావు త‌న రాజ‌కీయ జీవితం కింది స్థాయి నుంచి మొద‌లు పెట్టారు. ఆయ‌న 1983 సంవ‌త్స‌రంలో శ్రీకాకుళం జిల్లా పోలాకి మండ‌లం మబగం గ్రామ పంచాయతీకి స‌ర్పంచ్ గా మొద‌టిసారిగా ఎన్నిక‌య్యారు. అనంత‌రం 1987లో పోలాకి మండ‌లానికి ఎంపీపీగా ప‌ని చేశారు. 1989 సంవ‌త్స‌రంలో నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొద‌టి సారిగా ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. 

1991 నుంచి 1994 సంవ‌త్స‌రం కాలంలో ఉమ్మ‌డి ఏపీ మంత్రిగా ప‌ని చేశారు. అయితే 1994 సంవ‌త్స‌రంలో వ‌చ్చిన ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోయారు. త‌రువాత వ‌చ్చిన 1999, 2004, 2009 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజ‌యం సాధిస్తూ వచ్చారు. 2004 సంవత్స‌రం నుంచి దివంగ‌త నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో కూడా ప‌ని చేశారు. అనంత‌రం మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల్లోనూ 2013 వ‌ర‌కు ఆయ‌న మంత్రిగా కొన‌సాగారు. 

2013 సంవ‌త్స‌రంలో వైఎస్సార్ సీపీలో ధ‌ర్మాన ప్ర‌సాద్ రావు జాయిన్ అయ్యారు. 2014లో ఇదే పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అనంత‌రం వైసీపీ నుంచే 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేసి విజ‌యం సాధించారు. కాంగ్రెస్ పార్టీలో అనేక స్థాయిల్లో ప‌ని చేసిన ధ‌ర్మాన‌.. వైసీపీ స్టేట్‌ జనరల్‌ సెక్రటరీగా, ఆ పార్టీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌గా కూడా ప‌ని చేశారు. అలాగే శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్తగా, తూర్పుగోదావరి జిల్లా ఇన్‌చార్జిగా, అధికార ప్రతినిధిగా కూడా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. ఇప్పుడు జ‌గ‌న్ కేబినేట్ లో స్థానం సంపాదించుకున్నారు.