అమరావతి: ఏపీ పోలీసులు దేశంలోనే ఒక అత్యుత్తమ పోలీస్ ఫోర్స్ గా గుర్తించబడిందని డిజిపి గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఏపీఎస్పీ అధికారులు గత సంవత్సరంలో కష్టపడి పనిచేశారని...వారికి మరింత ప్రోత్సాహం అందించేందుకు ఓ కొత్త అవార్డును ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. విధుల నిర్వహణలో అద్భుతమైన ప్రతిభ కనపరిచిన వారికి ఇకనుండి డీజీపీ డిస్క్ అవార్డును అందించనున్నట్లు సవాంగ్ ప్రకటించారు.

''ఏపీఎస్పీ అనేది ఒక పారామిలటరీ ఫోర్స్ లాగా ఏర్పాటయింది. ఈ ఫోర్స్ స్వాతంత్ర్యం ముందు నుంచీ ఉన్నది. ఏపీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఏపీఎస్పీ పనిచేస్తోంది. ఈశాన్య రాష్ట్రాలలో కూడా సేవలందించిన చరిత్ర ఏపీఎస్పీకి ఉంది. ఏపీఎస్పీ సేవలు అత్యుత్తమం'' అని డిజిపి కొనియాడారు.

''పోలీసులకు, సెక్యూరిటీలకు ఏపీఎస్పీ ఒక వెన్నెముక. ఏపీఎస్పీ సేవలు ఉన్నచోట పరిస్ధితులు త్వరగా అదుపులోకి వస్తాయి. గ్రేహౌండ్స్, ఆక్టోపస్, సెక్యూరిటీ వింగ్స్ కు ఏపీఎస్పీ ఒక వెన్నెముక. ఏపీ సెక్యూరిటి వింగ్ దేశానికే ప్రామాణికం. ఎస్డీఆర్ఎఫ్ కూడా ఏపీఎస్పీలో ఒక భాగమే'' అని డిజిపి వివరించారు.