అమరావతి: ఆనాడు జగన్ అక్రమ ఆస్తులకు సంబంధించిన ఫిర్యాదులో ఎర్రన్నాయుడు సంతకం చేశారనే ఆయన కుటుంబంపై కక్ష గట్టారని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. అందువల్లే నాలుగు దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉన్న ఎర్రన్నాయుడు కుటుంబాన్ని జగన్ ప్రభుత్వం టార్గెట్ చేసిందని... ఇందులో భాగంగానే మాజీ మంత్రి అచ్చెన్నాయుడుపై కేసు పెట్టి  అరెస్టు చేసిందన్నారు. 

''ఆరోగ్యం బాగాలేకపోయినా ఇబ్బందులు పెడుతున్నారు. అచ్చన్నాయుడును జైలుకు పంపేందుకు కుట్ర పన్నారు. అందుకే జగన్ ఆయనపై కుట్రతో కేసులు పెట్టించారు. అవినీతి జరిగినట్లు ఆధారాలు లేకపోయినా కేసులు పెట్టారు. అవినీతి బురదలో ఉన్న వైకాపా ప్రభుత్వం మా పార్టీ నాయకుడిపై బురద చల్లుతోంది'' అని ఉమ మండిపడ్డారు. 

ఇక ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ...అచ్చెన్నాయుడును కలవడానికి ఇవాళ కూడా అధికారులు అంగీకరించలేదన్నారు. ఆసుపత్రి అధికారులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నామని తెలిపారు.  కక్ష సాధింపు చర్యల్లో భాగమే అచ్చెన్నాయుడిపై కేసులని మండిపడ్డారు. 

read more   చంద్రబాబు అప్పులు చేసింది నిజమే...ఐదేళ్లలో ఎంతంటే..: చినరాజప్ప

''శస్త్ర చికిత్స చేయించుకున్న వ్యక్తిని వందల కిలోమీటర్లు తీసుకు వచ్చారు. న్యాయమూర్తి చెబితే గాని ఆసుపత్రికి తీసుకు రాలేదు. అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. కానీ ఆసుపత్రి సూపరింటెండెంట్ సంతకం లేకుండానే నివేదిక ఇస్తున్నారు. కింది స్థాయి అధికారుల పేరిట నివేదిక పంపిస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా ఆసుపత్రి అధికారులు వ్యవహరిస్తున్నారు'' అని అన్నారు. 

''అచ్చన్నాయుడుని ఎలాగైనా జైలులో పెట్టాలనై ప్రయత్నం చేస్తున్నారు. ఇందు కోసం ముఖ్యమంత్రి.. ఏసీబీ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. అర్థరాత్రి సమయంలో అచ్చెన్నాయుడును డిశ్చార్జి చేసేందుకు యత్నించారు. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు'' అని రామ్మోహన్ నాయడు ఆరోపించారు.