విజయసాయి రెడ్డి కనిపించడం లేదు, వెతకండి: దేవినేని ఉమ

Devineni Uma says Vijaya sai Reddy is missing
Highlights

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించడం లేదని, ఎక్కడున్నారో వెతకాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు అన్నారు.

విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించడం లేదని, ఎక్కడున్నారో వెతకాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు అన్నారు. విజయసాయి రెడ్డి సహా మరికొంత మంది వైఎస్సార్ కాంగ్రెసు నాయకులు కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి కుటుంబసభ్యులను, ఆయన అనుచరులను గెలిపించే పనిలో ఉన్నారని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. 

కుట్ర రాజకీయాలకు, నమ్మద్రోహానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధర్మపోరాటం చేస్తుంటే ప్రతిపక్ష నేత వైయెస్ జగన్ మాత్రం ప్రత్యేక హోదాపై ప్రధాని మోడీని, కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు. చంద్రబాబుకు దేశవిదేశాల్లోని తెలుగువారు మద్దతు తెలుపుతున్నారని, జగన్ మాత్రం కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు. 

ఆంధ్రప్రదేశ్ బిజెపిలో అధ్యక్ష పదవి ఖాళీగా ఉందని, ఆ పదవిని జగన్ తీసుకోవాలని దేవినేని ఉమ వ్యంగ్యంగా అన్నారు. బిజెపితో జగన్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కనుసన్నల్లో జగన్ నడుస్తున్నారని వ్యాఖ్యానించారు. 

తనపై ఉన్న కేసుల నుంచి బయటపడేందుకు, ఈడీ నుంచి ఆస్తులను విడిపించుకునేందుకు బిజెపి చెప్పినట్లు జగన్ ఆడుతున్నారని అన్నారు. కృష్ణా జిల్లాలో పర్యటిస్తూ పట్టిసీమ గురించి జగన్ మాట్లాడకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. 

పులివెందుల ప్రజలు 40 ఏళ్లుగా జగన్ కుటుంబానికి పదవులు ఇచ్చారని, అయితే పులివెందులకు మాత్రం తమ తెలుగుదేశం పార్టీ నీళ్లు ఇచ్చిందని అన్నారు. జగన్ కు లోటస్ పాండ్ పై ఉన్న శ్రద్ధ పులివెందులపై లేదని అన్నారు. పులివెందుల చుట్టూ ఉన్న నీళ్లను నెత్తిన పోసుకుంటే జగన్ పాపాలు సగమైనా పోతాయని న్నారు. 

వచ్చే ఎన్నికల్లో జగన్ పులివెందుల నుంచి కాకుండా బయటి జిల్లాల్లో పోటీ చేసేందుకు పయత్నాలు చేస్తున్నట్లు వైసిపి నాయకులు గుసగుసగా చెప్పుకుంటున్నారని అన్నారు. ఎపికి కేంద్రం చేసిన నమ్మకద్రోహాన్ని ధర్మపోరాట దీక్ష ద్వారా తిరుపతి వేదికగా ఎండగడుతామని అన్నారు. 

loader