ఒంగోలు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు. పీపీఏలపై సీఎం వైయస్ జగన్ కు అవగాహన లేదని విమర్శించారు. 

ఒంగోలులో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లి ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం జగన్ ప్రభుత్వం ఇస్తోన్న తొమ్మిది గంటల విద్యుత్ చంద్రబాబు కష్టం వల్లే సాధ్యమవుతోందని స్పష్టం చేశారు. 

విండ్ పవర్ మీద అసెంబ్లీలో జగన్ చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు. నాలుగు రోజులు విండ్ పవర్ ఆపి చూస్తే, థర్మల్ పవర్ ఏవిధంగా కాపాడుతుందో జగన్ కు అర్థమవుతుందంటూ విమర్శించారు. 

రెగ్యులేటర్ కమిటీ కృష్ణపట్నం గానీ, జుడీషియల్ పట్ల గాని ఆ రోజు వైఎస్ పీపీఏ అన్నట్లే నేడు జగన్ కూడా పీపీఎల్ అంటున్నారని ఎద్దేవా చేశారు. విద్యుత్ కొనుగోళ్ళ అగ్రిమెంట్లలో కర్ణాటకలోని జగన్‌కు చెందిన వాటిల్లో యూనిట్ ధర ఐదు రూపాయలు తీసుకుంటున్న దానిపై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. 
 
తెలుగుదేశం పార్టీపై బురదజల్లేందుకే జగన్ పీపీఏల విషయం ప్రస్తావన తీసుకువస్తున్నట్లు తెలిపారు. జగన్ నోట అమరావతి అనే పదాన్ని కూడా ఉచ్చరించడం లేదని విమర్శించారు. జగన్ ప్రవర్తన వల్లే అమరావతికి కేటాయించిన బడ్జెట్ వల్ల ప్రపంచ బ్యాంకు వెనక్కివెళ్లిపోయిందన్నారు. 

గోదావరి జలాల పంపకాలపై జగన్ వింతగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా ఆదుకుంది కాబట్టే గోదావరి నీటిని తాకట్టుపెట్టారంటూ విమర్శించారు. 

పోలవరం ప్రాజెక్టు పూర్తైతే శ్రీశైలం, సోమశిల, వెలుగొండతో పాటు అనేక ప్రాంతాలకు నీరు అందించవచ్చని స్పష్టం చేశారు. రాయలసీమకు కూడా జలాలు వాడుకునేలా రిపోర్టును తయారు చేసి పెడితే క్విడ్ ప్రోకో కోసం తెలంగాణకు తాకట్టుపెట్టారని దేవినేని ఉమా మహేశ్వరరావు ఆరోపించారు.