Asianet News TeluguAsianet News Telugu

ఆ అధికారులపైనా వాలంటీర్ల పెత్తనమే... ఏకంగా బెదిరింపులు: దేవినేని ఉమ

రైతు దినోత్సవం పేరుతో వైసిపి ప్రభుత్వం పత్రికలు, టీవీల్లో ప్రకటనలకు వేల కోట్లు ఖర్చు చేస్తూ ప్రజాధనం దుబారా చేస్తోందని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరారావు మండిపడ్డారు. 

Devineni Uma Controversial Comments On Volunteer
Author
Vijayawada, First Published Jul 8, 2020, 9:25 PM IST

విజయవాడ: రైతు దినోత్సవం పేరుతో వైసిపి ప్రభుత్వం పత్రికలు, టీవీల్లో ప్రకటనలకు వేల కోట్లు ఖర్చు చేస్తూ ప్రజాధనం దుబారా చేస్తోందని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరారావు మండిపడ్డారు. టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... దీనిని  రైతుసొమ్ము దుబారా దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించి ఉండాల్సిందని ఎద్దేవా చేశారు. రైతులను ఏం ఉద్ధరించారని ఈ ప్రభుత్వం రైతు దినోత్సవం జరుపుతోందని ప్రశ్నించారు. 

''ఏడాదిలో సాగునీటి రంగానికి మేం రూ.14 వేల కోట్లు ఖర్చు చేస్తే వైసీపీ ప్రభుత్వం కేవలం  రూ.4వేలకోట్లు కూడా ఖర్చు చేయలేకపోయింది.  ఆ 4వేలకోట్లు కూడా కాంట్రాక్టర్లకే చెల్లించారు తప్ప ఎక్కడా ఏ ప్రాజెక్టులో బొచ్చె మట్టి తీయలేదు... వేయలేదు. టీడీపీ ప్రభుత్వం వ్యవసాయ, సాగునీటి రంగాలకు ప్రాధాన్యత ఇచ్చి రైతులకు మేంలు చేసింది. టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన రైతు రుణమాఫీ కింద లక్షా 50వేల రుణమాఫీని తప్పుపట్టిన జగన్, అధికారంలోకి రాగానే ఆ పథకాన్ని పక్కన పెట్టాడు. ఏటా ప్రతిరైతుకు రాష్ట్ర బడ్జెట్ నుంచి రూ.12,500 ఇస్తామని చెప్పి, 7వేలకే పరిమితం చేశారు. ప్రతిరైతూ ఏటా రూ.5వేలచొప్పున ఐదేళ్లకు రూ.25వేలు నష్టపోయాడు'' అని తెలిపారు. 

''సున్నా వడ్డీ పథకం జీవో ఇవ్వడానికి  ఈ ప్రభుత్వానికి ఏడాది పట్టింది. సున్నా వడ్డీ పథకం టీడీపీ పాలనలో కూడా కొనసాగిందని చెప్పబట్టే, జగన్ ప్రభుత్వం మాపార్టీ వారిపై కక్ష కట్టింది. లక్ష రూపాయలు రుణం తీసుకుంటే, లక్షకు రూ.7వేలు వడ్డీ కడితే, ఏడాది తర్వాత ప్రభుత్వం తిరగిస్తుందట.. ఇదేనా సున్నా వడ్డీ పథకం.‎?''  అని నిలదీశారు.  

''జిల్లాల్లో రైతు భరోసా కేంద్రాల పేరుతో హబ్ లు ఏర్పాటుచేసిన ప్రభుత్వం సాగుగురించి తెలుసుకోకుండా, అదును, పదునూ చూడకుండా విత్తనాలు, ఎరువులు అమ్మకానికి పెట్టింది. అజయ్ కల్లం రెడ్డి, నాగిరెడ్డి, కన్నబాబు అనే త్రిమూర్తులు కలిసి రైతులు రైతుభరోసా కేంద్రాల చుట్టూ తిరిగేలా చేశారు. రైతు భరోసా కేంద్రం చుట్టూ తిరిగేలా, భరోసా కేంద్రం వాహనాలు వచ్చే వరకు వేచిచూసేలా రైతులను దిగజార్చారు'' అని ఉమ మండిపడ్డారు. 

''వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ ఉద్యోగులు పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ శాఖలపై పెత్తనం చేస్తున్నారు. గతంలో మండలానికి 15నుంచి 16 మంది వరకు వ్యవసాయ సిబ్బంది, అధికారులుండేవారని...వారే నేరుగా రైతుల వధ్దకు వెళ్లి సలహాలు, సూచనలు ఇచ్చేవారన్నారు. రంగులేసిన రైతుభరోసా కేంద్రాల్లో  విత్తనాలు ఎక్కువధరకు అమ్ముతున్నారు. అదునుపదును పోయాక రైతులకు విత్తనాలు ఇస్తే ఉపయోగం ఏమిటి?'' అని ప్రశ్నించారు. 

''రైతుబంధు పథకం కింద 180రోజుల వరకు వడ్డీ లేని రుణాన్ని టీడీపీ ప్రభుత్వం అందించిందని... గిట్టుబాటు ధరను బట్టి రైతుల ఉత్పత్తులు అమ్మడం జరిగేదన్నారు. మిర్చికి  రూ.7వేలు మద్ధతు ధర, సుబాబుల్ కు టన్నుకు రూ.1600 ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకున్నారు. రబీలో ధాన్యం రైతులనుంచి   కొనుగోలు చేసిన ప్రభుత్వం ఇంకా రూ.500కోట్లవరకు  రైతులకు చెల్లించాల్సి ఉంది'' అని తెలిపారు. 

read more   వారి ఉసురు పోసుకోవడమే వైసిపి రైతు దినోత్సవమా..? :ప్రభుత్వానికి చంద్రబాబు సవాల్

''బడ్జెట్ సమావేశాల్లో దేనికెంత ఖర్చు చేశారో ఈ ప్రభుత్వం చెప్పగలదా? కరోనాను అడ్డం పెట్టుకొని దేనికెంత ఖర్చుచేసిందనే జమా ఖర్చులు చెప్పకుండా, ప్రభుత్వం పారిపోయింది. వాలంటీర్ వ్యవస్థ ఎంతబాగా పనిచేస్తోందో చూస్తున్నాం. వ్యవసాయ అధికారులంతా మా ఖర్మ మేం ఎవరికి చెప్పుకోవాలి ...వాలంటీర్లు మమ్మల్ని బెదిరిస్తున్నారని వాపోతున్నారు'' అని ఆవేదన చెందుతున్నారని దేవినేని ఉమ వెల్లడించారు. 

''రైతు భరోసా పేరుతో 64 లక్షల మంది రైతుల్ని 54 లక్షలకు కుదించారు. ఏజిల్లాలో ఎంతమంది రైతులకు రుణాలు ఇచ్చారో చెప్పగలరా? కౌలురైతులు  15లక్షల 50వేల మంది ఉంటే వారిలో ఎంతమందికి ఎంతమొత్తం రుణాలిచ్చారో చెప్పాలి. కౌలు రైతులకు కులాలు చూస్తారా? రైతుభరోసా కేంద్రాల్లో కౌలురైతుల గుండె పగులుతోంది. డెల్టాప్రాంతంలో 70శాతం మంది కౌలు రైతులున్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కౌలురైతు కులం అడగలేదు? ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే అలా జరుగుతోంది'' అని మండిపడ్డారు. 

''ప్రభుత్వం జూన్ 30న సున్నా వడ్డీ పథకానికి సంబంధించి ఇచ్చిన జీవో చూస్తే  దానిలోని లోగుట్టు ఏమిటో తెలుస్తుంది. రైతులే సున్నా వడ్డీ పథకం కింద డబ్బులుకడితే తిరిగి ఇస్తారట. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చిన గత ప్రభుత్వాలు 2004-14 మధ్యన రూ.63,616 కోట్లకు పాలనాపరమైన అనుమతులిచ్చి, తరువాత నాలుగేళ్లకే దాన్ని రూ.82,864కోట్లకు పెంచారు. రాజశేఖర్రెడ్డి పరిపాలనలో రూ.22,656కోట్లు ఖర్చు చేస్తే, 2009 -14 మధ్యన 27,530 కోట్లు ఖర్చు చేశారు.ఈ ఐదేళ్లలో రూ.63,373కోట్లు ఖర్చుచేయడం జరిగింది. పోలవరం కాలువల్లో గత ప్రభుత్వాలు మట్టితీసి వెళితే,  మా ప్రభుత్వం గోదారి నీళ్లను కృష్ణాకు తరలించడానికి  పట్టీసీమ నిర్మించింది. దిగుబడులు వచ్చాయని ఈ ప్రభుత్వం డబ్బాలు కొట్టుకుంటోందని, అవి ఎలా వచ్చాయో చెప్పాలి?'' అని అన్నారు దేవినేని ఉమ.

''తోటపల్లి, వంశధార పనులు, నాగావళి-వంశధార అనుసంధానం పనులు, పట్టసీమ, పురుషోత్తమపట్నం, హంద్రీనీవా లతో నీళ్లు పారించాం. డీఎన్ ఎస్ ఎస్ కాలువ, మచ్చుమర్రి పథకాల పనులను ఈ ప్రభుత్వం ఎందుకు ఆపేసింది? పులిచింతలలో 45 టీఎంసీల నీళ్లు ఎందుకు నిలపలేకపోయారు. 800 టీఎంసీలు సముద్రం పాలవుతున్న ఎందుకు నిల్వచేయలేదు? గోదావరి నుంచి 3వేల టీఎంసీలు సముద్రం పాలయ్యాయి. ఆర్ అండ్ ఆర్ కింద పోలవరం వల్ల నష్టపోయిన పేదలను ఉద్దరిస్తామన్న ప్రభుత్వం, ఎందరు పేదలకు ఇళ్లు కట్టించిందో చెప్పాలి. ఎంతమంది నిర్వాసితుల ఇళ్లలో సిమెంట్ పనులుచేశారు?'' అని అడిగారు. 

''బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన లేఖ వల్లే కర్ణాటక, మహారాష్ట్ర  అడ్డగోలుగా నిర్మాణాలు చేస్తున్నాయి. చంద్రబాబు న్యాయపోరాటం చేయడం వల్లే ఆలమట్టి ఎత్తు పెంచకుండా చేశారు. వంశధార వివాదాలను పక్కరాష్ట్రాలతో న్యాయపోరాటం చేసి పరిష్కరించగలిగాము. వ్యక్తిగత కేసుల్లో బిజీగా ఉన్నారు తప్ప నీటివివాదాలకు సంబంధించిన కేసుల గురించి ప్రభుత్వ పెద్దలు ఆలోచించడం లేదు'' అని మాజీ మంత్రి ఉమ మండిపడ్డారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios