Asianet News TeluguAsianet News Telugu

వారి ఉసురు పోసుకోవడమే వైసిపి రైతు దినోత్సవమా..? :ప్రభుత్వానికి చంద్రబాబు సవాల్

 వైసిపి జరపాల్సింది ''రైతు దినోత్సవం'' కాదు ''రైతు దగా దినోత్సవం'' అని టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.

tdp chief chandrababu challange to ycp govt
Author
Amaravathi, First Published Jul 8, 2020, 8:26 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

గుంటూరు: వైసిపి జరపాల్సింది ''రైతు దినోత్సవం'' కాదు ''రైతు దగా దినోత్సవం'' అని టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వ్యవసాయ బడ్జెట్ లో 35%మాత్రమే ఖర్చు పెట్టిన మీకు రైతు దినోత్సవం జరిపే హక్కెక్కడిది..? అని అన్నారు. 65% బడ్జెట్ రైతులకు ఖర్చు చేయలేక పోవడం మీ చేతగానితనం కాదా.. ? అని నిలదీశారు. వైసిపి తొలి ఏడాది వ్యవసాయానికి బడ్జెట్ లో రూ20,250కోట్లలో మూడోవంతు (రూ7 వేల కోట్లు) కూడా ఖర్చు పెట్టలేదు అని చంద్రబాబు తెలిపారు. 

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వ్యవసాయానికి 10% బడ్జెట్ పెంచిన ఘనత టిడిపి ప్రభుత్వానిదేనని  పేర్కొన్నారు. టిడిపి 5ఏళ్లలో వ్యవసాయానికి రూ 90వేల కోట్ల నిధులతో రైతులను ఆదుకున్నామని అన్నారు.

''రైతు భరోసా కొత్త పథకం ఏమీ కాదు. టిడిపి పథకం ‘‘అన్నదాత సుఖీభవ’’ రద్దుచేసి దీనిని తెచ్చారు. దీని వల్ల ఒక్కో రైతుకు 5ఏళ్లలో రూ80వేలు నష్టం చేశారు.  రైతు భరోసా పేరుతో 5ఏళ్లలో ఒక్కో రైతుకు వైసిపి ప్రభుత్వం ఇచ్చేది రూ37,500మాత్రమే, అదే టిడిపి ప్రభుత్వం వచ్చివుంటే ఒక్కో రైతుకు లక్షా 20వేలు వచ్చేది.  కేంద్రం ఇచ్చేది కాకుండా ఇది అదనం'' అని అన్నారు. 

''బడ్జెట్ లో చెప్పిన సంఖ్యలోనే 10లక్షల మంది రైతులకు భరోసా ఎగ్గొట్టారు. సున్నావడ్డీ పథకానికి రూ 1,100కోట్ల బడ్జెట్ పెట్టి రూ100కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడమే వైసిపి రైతు దినోత్సవమా..?  రైతుల సున్నావడ్డీకి రూ3,600కోట్లు కావాలని అసెంబ్లీలో చెప్పిన జగన్ రెడ్డి కేవలం రూ100కోట్లే ఖర్చు పెట్టారు.  సున్నావడ్డీ పథకం నేనే తెచ్చానని అసెంబ్లీలో చెప్పిన జగన్ రెడ్డి అది కిరణ్ కుమార్ రెడ్డి తెచ్చిన పథకంగా టిడిపి రుజువు చేయడంతో పారిపోయాడు. అలాంటిది సున్నా వడ్డీ పాత బకాయిలు రూ1,050కోట్లు తామే చెల్లించామని చెప్పడం హాస్యాస్పదం'' అని విమర్శించారు. 

read more   సీఎం కార్యాలయంలో కీలక మార్పులు... జగన్ సర్కార్ సంచలన నిర్ణయం

''రుణమాఫీ రూ7వేల కోట్లు ఎగ్గొట్టడమే వైసిపి రైతు దినోత్సవమా..? రుణమాఫీ కింద సింగిల్ పేమెంట్ లో ప్రతి రైతుకు టిడిపి ప్రభుత్వం రూ50వేలు అందజేసింది. మిగిలిన రూ లక్ష వాయిదాల ద్వారా ఇస్తుంటే 4,5 కిస్తీలకు అడ్డంపడి ఎగ్గొట్టారు. రైతుల్లో కులాల ప్రస్తావన 73ఏళ్ల దేశ స్వాతంత్ర్య చరిత్రలో లేదు. అలాంటిది రైతుల్లో కులాల పేరుతో చీలిక తెచ్చిన ఘనత వైసిపిదే.  15లక్షల మంది కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని చెప్పి అందులో పదోవంతు కూడా ఇవ్వకుండా మోసం చేశారు. 34వేల ఎకరాలు రాజధానికి ఇచ్చిన రైతులు, మహిళలు, రైతుకూలీల ఉసురు పోసుకోవడమే వైసిపి రైతు దినోత్సవమా..?'' అని మండిపడ్డారు. 

''వ్యవసాయ యాంత్రీకరణకు టిడిపి ప్రభుత్వం రూ2,500కోట్లు ఖర్చు చేస్తే అందులో పదోవంతు కూడా వైసిపి చేయలేదు. మైక్రో ఇరిగేషన్ లో దేశంలోనే రాష్ట్రాన్ని ముందుంచితే, ఇప్పుడు 17వ స్థానానికి తెచ్చారు. టిడిపి హయాంలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో 11% వృద్ది టిడిపి సాధించాం. రెండంకెల వృద్దిని సింగిల్ డిజిట్ కు వైసిపి దిగజార్చింది. ఆక్వా రంగంలో వృద్ది 34%నుంచి 5%కు పడిపోయింది'' అని చంద్రబాబు తెలిపారు. 

''టిడిపి ప్రభుత్వం రైతులకు ఉచితంగా ఇచ్చిన జిప్సం తదితర మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఎగ్గొట్టారు.  రూ 3వేల కోట్ల మార్కెట్ ఇంటర్వెన్షన్ ఒక బోగస్. బోగస్ లెక్కలతో, తప్పుడు సమాచారంతో ప్రభుత్వ ప్రకటనలకు ప్రజాధనం దుర్వినియోగం సిగ్గుచేటు. ఎవరెవరి రైతుల ఖాతాల్లో సున్నావడ్డీ జమ చేశారో రైతు భరోసా కేంద్రాల్లో జాబితా పెట్టే ధైర్యం ఉందా..? ఏయే రైతులకు బీమా పరిహారం చెల్లించారో వాళ్ల పేర్లు రైతు భరోసా కేంద్రాల్లో జాబితా పెట్టగలరా..?'' అని ప్రభుత్వానికి చంద్రబాబు సవాల్ విసిరారు.

''నీటిపారుదల ప్రాజెక్టుల బడ్జెట్ 60% ఖర్చుపెట్టడంలో విఫలమైన మీరు రైతు దినోత్సవం ఎలా జరుపుతారు..? నీటి పారుదల ప్రాజెక్టులపై టిడిపి ఒక్కఏడాదే రూ13,340కోట్లు ఖర్చు పెడితే మీ తొలి ఏడాదిలో రూ4వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేక పోయారు.  చేసి 5ఏళ్లలో రూ64వేల కోట్లు ఖర్చు చేశాం. 23ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేశాం, మరో 40ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరిపాం, పోలవరం పనులు 72% పూర్తి చేశాం. అలాంటిది గత ఏడాదిగా ప్రాజెక్టుల పనులన్నీ నిలిపేశారు. మిగులు జలాలపై హక్కు వదులుకుంది ఎవరో, రుణమాఫీ ఇవ్వవద్దని లేఖ రాసింది ఎవరో, కాకరాపల్లి, సోంపేట, ముదిగొండ కాల్పులలో 14మంది రైతుల ప్రాణాలు బలితీసుకుంది ఎవరో రాష్ట్ర రైతాంగం మరిచిపోలేదు'' అని చంద్రబాబు పేర్కొన్నారు. 


  

Follow Us:
Download App:
  • android
  • ios