మంగళవారం రాష్ట్రం మొత్తానికి రూ. 1220 కోట్లు అందాయి. అయితే, అవసరాలతో పోల్చుకుంటే వచ్చింది చాలా తక్కువ డబ్బనే చెప్పాలి.
పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో ప్రజల్లో నిరసనలు తీవ్ర మవుతున్నాయి. నోట్ల రద్దు చేసి 28 రోజులైనా సమస్యలు తీరకపోగా మరింత పెరుగుతుండటంతో ప్రజల్లో కూడా అసహనం కట్టలు తెంచుకుంటున్నది. సామాన్య ప్రజలకు ప్రభుత్వ ఉద్యగులు కూడా తోడవ్వటంతో రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం అనేక చోట్ల రాస్తారోకోలు, నిరసనలు జరిగాయి.
బ్యాంకులు, ఏటిఎంల్లో ప్రజావసరాలకు సరిపడా నగదు అందుబాటులో ఉండటం లేదు. పైగా పలు బ్యాంకుల్లోను, ఏటిఎంల్లో ‘నో క్యాష్’ బోర్డులు దర్శనమిస్తుండటంతో ప్రజల ఆగ్రహం అవధులు దాటుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోని ఓ బ్యాంకు శాఖ అద్దాలను ధ్వంసం చేసారు. పలుచోట్ల ధర్నాలకు దిగారు.
అనేక చోట్ల ప్రజలు బ్యాంకుల ముందే రాస్తారోకోలు జరిపారు. దానికి తోడు ప్రభుత్వం చెబుతున్న నగదు రహిత విధానంపై ప్రజల్లో పూర్తిస్దాయిలో అవగాహన లేకపోవటంతో ఆ విధానాన్ని అవలంభించటం పట్ల పెద్దగా మొగ్గు చూపటం లేదు.
తూర్పుగోదావరి జిల్లాలోని ఎస్బిఐ అల్లవరం బ్రాంచ్ ముందు ఖాతాదారులు ధర్నా చేసారు. నో క్యాష్ బోర్డులు దర్శనమివ్వటమే ఖాతాదారుల కోపానికి కారణమైంది. అనంతపురం జిల్లాలోని తలపుల మండల కేంద్రంలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఖాతాదారులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు.
కడప జిల్లా ఎస్ బిఐ రీజనల్ మేనేజర్ శేషుబాబును పులివెందులలో ఖాతాదారులు ఘోరావ్ చేసారు. నెల్లూరు జిల్ల వెంకటగిరిలో ప్రభుత్వ ఉద్యోగులే పెద్ద ఎత్తున రాస్తారోకో జరిపారు.
ఉద్యోగులకు, ఫించన్ దారులకు డబ్బు బ్యాంకుల్లో జమైనా తీసుకునే అవకాశం లేకపోవటంతో నానా అవస్తలు పడుతున్నారు. బ్యాంకుల్లో డబ్బున్నా చేతికి రాకపోవటంతో వారి భాదలు వర్ణనాతీతం. ప్రజల అవసరాలకు సరిపడా డబ్బులు రాకపోవటంతో పాటు వచ్చిన కొద్ది డబ్బు కూడా ఇతరత్రా పక్కదారులు పడుతున్నాయన్న ఆరోపణలతో సామాన్య ప్రజలు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు.
మంగళవారం రాష్ట్రం మొత్తానికి రూ. 1220 కోట్లు అందాయి. అయితే, అవసరాలతో పోల్చుకుంటే వచ్చింది చాలా తక్కువ డబ్బనే చెప్పాలి. దానికి తోడు జీతాలొచ్చిన మొదటి వారం కావటంతో ప్రతీ ఇంట్లోనూ అనేక అవసరాలుంటాయి. అవసరాలకు సరిపడా నగదు చేతిలో లేకపోవటంతో ప్రతీ ఇంటిలోనూ అసహనం కట్టలు తెంచుకుంటోంది.
