ఇతర రాష్ట్రాల్లోని ప్రతిపక్ష పార్టీ ఎంఎల్ఏలకు తమిళనాడులోని డిఎంకె సభ్యులు మార్గదర్శకులుగా నిలిచిపోదామని అనుకున్నట్లే కనబడింది.
తమిళనాడులో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని సందేహం వస్తున్నది. ముఖ్యమంత్రి పళనిస్వామి బలపరీక్ష సందర్భంగా అసెంబ్లీలో చోటు చేసుకున్న ఘటనలు ప్రజాస్వామ్యానికే మాయని మచ్చలాగ మిగిలిపోతాయి. 29 సంవత్సరాల తర్వాత తమిళనాడులో ఓ ముఖ్యమంత్రి బలపరీక్షకు సిద్ధ పడ్డారు. అటువంటి పరిస్ధితిలో పాలకపక్షంలోనే ఉన్న రెండు వర్గాల మధ్య గొడవలు జరుగుతాయని అందరూ అనుకున్నారు. అయితే, అనూహ్యంగా మధ్యలో ప్రతిపక్ష డిఎంకె దూరింది. ఉదయం సభ మొదలైన దగ్గర నుండి డిఎంకెనే పన్నీర్ సెల్వం తరపున వకాల్తా పుచ్చుకున్నట్లు కనబడింది.
పన్నీర్ వర్గం గొడవలు చేస్తారని అనుకుంటే సంబంధం లేని డిఎంకె గొడవకు దిగటం ఆశ్చర్యమేసింది. ఆనవాయితీ లేని రహస్య ఓటింగ్ కు పట్టుబట్టడం ద్వారా డిఎంకె తన ఉద్దేశ్యాన్ని స్పష్టంగా తెలియజేసింది. అదే డిమాండ్ పై సభ జరిగినంతసేపూ గొడవలు చేస్తూనే ఉంది. దాంతో సభను స్పీకర్ పలుమార్లు వాయిదా వేసినా అంతిమంగా పళనిస్వామే గెలిచినట్లు ప్రకటించారు. అయితే, సభలో జరిగిన గొడవలు మాత్రం ఎంతమాత్రం క్షమార్హం కావు.
రహస్య ఓటింగ్ కు పట్టుబట్టిన డిఎంకె సభ్యులు చివరకు స్పీకర్ ధన్పాల్ మీద కూడా దాడిచేసారు. స్పీకర్ను కుర్చీలోనుండి నెట్టేసారు. స్పీకర్ కుర్చీలో డిఎంకె సభ్యులు కూర్చున్నారు. కాగితాలు చింపేసారు, కుర్చీలు, బల్లలు విరగొట్టారు, మైక్ లు కూడా విరిచేసారు. మొత్తం మీద ఇతర రాష్ట్రాల్లోని ప్రతిపక్ష పార్టీ ఎంఎల్ఏలకు తమిళనాడులోని డిఎంకె సభ్యులు మార్గదర్శకులుగా నిలిచిపోదామని అనుకున్నట్లే కనబడింది. సభలో గొడవలు మామూలే అయినా ఏకంగా స్పీకర్ కుర్చీలోనే కూర్చోవటం విచిత్రం. ఇంతకీ అసలేమి ఆశించి డిఎంకె నేత స్టాలిన్ ఇదంతా చేసారో ఎవరూ ఊహించలేకున్నారు.
