బాయిలర్ ఏర్పాటుకు అనుమతి కోసం లంచం డిమాండ్.. ఏసీబీ వలలో డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ సత్యనారాయణ ఏసీబీ వలలో చిక్కారు. ఆయన అసిస్టెంట్ నాగభూషణం సెంటారస్ ఫార్మా కంపెనీ యజమాని దగ్గరి నుంచి నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రైడ్ చేసి పట్టుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న కొండపల్లి ఐడీఏ (ఇండ్రస్టియల్ డెవలప్‌మెంట్ ఏరియా)లో బుధవారం ఏసీబీ ఆఫీసర్లు రైడ్ చేశారు. ఇక్కడున్న సెంటారస్ ఫార్మా కంపెనీలో కొత్తగా బాయిలర్ ఏర్పాటు చేసేందుకు పర్మిషన్ కోసం డీసీఐబీ (డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ ) సత్యనారాయణ అసిస్టెంట్ గా ఉన్న నాగభూషణం లంచం తీసుకుంటున్న సమయంలో దాడి చేశారు. రూ.2.10 లక్షలు చేతులు మారుతుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
వనపర్తిలో దారుణం.. సొంత అన్నను నరికి చంపిన తమ్ముళ్లు.. ఆస్తి వివాదాలే కారణం..
అక్కడి సెంటారస్ ఫార్మా కంపెనీలో కొత్తగా బాయిలర్ ఏర్పాటు చేయాలని ఆ కంపెనీ యజమాని బాలిరెడ్డి భావించారు. దీని కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనికి పర్మిషన్ ఇచ్చేందుకు డీసీఐబీ (డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్) సత్యనారాయణ లంచం డిమాండ్ చేశారు. దాని కోసం రూ.5.50 లక్షలు ఇవ్వాలని కోరాడు. దీంతో ఆ కంపెనీ యజమాని రూ.3.50 లక్షలు ఇస్తానని ఒప్పించాడు. తరువాత ఏసీబీ అధికారులను సంప్రదించారు.
దీంతో ఏసీబీ అధికారులు బాలిరెడ్డికి రూ.2.10 లక్షలు ఇచ్చారు. వాటిని తీసుకొని సత్యనారాయణ అసిస్టెంట్ నాగభూషణంకు ఇచ్చారు. డబ్బులు నాగభూషణం తీసుకుంటుండగా ఆఫీసర్లు రైడ్ చేసి, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కాగా.. నాగ భూషణం అందించిన వివరాల ప్రకారం సత్యనారాయణను కూడా అదుపులోకి తీసుకున్నామని ఏసీబీ అడిషనల్ ఎస్పీ స్నేహిత తెలిపారు. ఆయనపై కూడా కేసు నమోదు చేశామని చెప్పారు.