Asianet News TeluguAsianet News Telugu

జగన్ ఒంట్లో పావలా దమ్ములేదు.. అన్న ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కాదు, రాష్ట్రానికి వచ్చిన విపత్తు: పవన్ కల్యాణ్

కృష్ణా జిల్లా పెడనలో జరిగిన వారాహి విజయ యాత్రలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసులకు భయపడేవారు రాజకీయాల్లోకి ఎందుకు వస్తారని ఆయన ప్రశ్నించారు.  జగన్ చెప్పిన 28 లక్షల ఇళ్లు ఎక్కడ వున్నాయో.. ఏమయ్యాయో నంటూ పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు.

janasena chief pawan kalyan slams ap cm ys jagan ksp
Author
First Published Oct 4, 2023, 8:20 PM IST | Last Updated Oct 4, 2023, 8:20 PM IST

కృష్ణా జిల్లా పెడనలో జరిగిన వారాహి విజయ యాత్రలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు ఒంట్లో పావలా దమ్ము లేదన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో సోనియా చూస్తారని భయపడి చాటుగా ప్లకార్డు పట్టుకున్నారని పవన్ దుయ్యబట్టారు. ప్రజలను కులాలుగా విడదీసి రాజకీయాలు చేయనని.. కులాలకు, మతాలకు అతీతంగా ప్రజలందరినీ చూస్తానని ఆయన చెప్పారు. రాష్ట్ర యువత కూడా కులాలకు అతీతంగా ఆలోచించాలని పవన్ పిలుపునిచ్చారు.

ప్రతిపక్ష నేతలను ఆయా కులాల వారితో తిట్టించడం జగన్ నైజమన్నారు. జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వమని పవన్ తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఓట్లు వేయించుకునేందుకే వైసీపీ పథకాలు వున్నాయన్నారు. అమలువరకు వచ్చేసరికి వైసీపీ పథకాల్లో అంతా డొల్లతనమేనని పవన్ ఆరోపించారు. మనలో విభేదాలు పాలసీల వరకే పరిమితం చేసుకోవాలని.. రాష్ట్ర ప్రయోజనాల వద్దకు వచ్చేసరికి మనమంతా ఒక్కటి కావాలని ఆయన పిలుపునిచ్చారు. 

వచ్చే ఎన్నికల తర్వాత జనసేన, టీడీపీ ప్రభుత్వం రాబోతోందని పవన్ ధీమా వ్యక్తం చేశారు. నిధుల మళ్లింపులో రాష్ట్రానిదే అగ్రస్థానమని కేంద్రం చెప్పిందని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం.. ఉపాధి కూలీల పొట్ట కొట్టిందని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సగానికి సగం ఉపాధి హామీ నిధులు దారి మళ్లించారని ఆరోపించారు. ప్రశ్నించే వారిపై పలురకాల కేసులు పెడుతున్నారని.. దేశంలోనే అతి ఎక్కువ దేశద్రోహం కేసులు ఏపీలోనే నమోదయ్యాయని పవన్ తెలిపారు . 

కేసులకు భయపడేవారు రాజకీయాల్లోకి ఎందుకు వస్తారని ఆయన ప్రశ్నించారు. హత్యలు చేసేవారికి, చేయించేవారికి జేజేలు కొడుతున్నారని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తే యువత మా సభలకు ఎందుకు వస్తారని ఆయన ప్రశ్నించారు. లక్షల మంది యువత మెగా డీఎస్సీ వేయాలని కోరుతున్నారని పవన్ చెప్పారు. పెడనలో ఏ పని చేయాలన్నా ఇక్కడి ఎమ్మెల్యేకు ట్యాక్స్ కట్టాలి ఆయన ఆరోపించారు. పాస్‌బుక్ కావాలంటే రూ.10 వేలు లంచం అడుగుతున్నారని.. రొయ్యల చెరువులో ట్రాన్స్‌ఫామ్ కావాలంటే లంచం ఇవ్వాల్సిందేనని పవన్ వ్యాఖ్యానించారు. 

మడ అడవులను కూడా ఆక్రమించి రొయ్యల చెరువులు వేశారని.. జగనన్న ఏపీకి బంగారు భవిష్యత్తు కాదు, ఆయనో విపత్తు అంటూ అభివర్ణించారు. 28 లక్షల ఇళ్లు కడతామని చెప్పి 3 లక్షల ఇళ్లే కట్టారని పవన్ దుయ్యబట్టారు. ఇళ్ల పేరుతో రూ.4 వేల కోట్లు దోచేశారని నివేదికలు చెబుతున్నాయని.. ప్లాస్టిక్‌పై నిషేధం పేరుతో ఫ్లెక్సీలను నిషేధించారని జనసేనాని ఆరోపించారు. తన సినిమాలు, పుట్టినరోజు వచ్చినప్పుడే ప్లాస్టిక్‌పై నిషేధం అంటారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. 

ఈ ప్రాంతాన్ని చతుర్ముఖ నగరంగా అభివృద్ధి చేస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. ఏపీలో కుల భావన ఎక్కువ.. జాతి భావన తక్కువ అని వ్యాఖ్యానించారు. కొనకళ్ల నారాయణపై దాడి చేయడం తనకు చాలా ఆవేదన కలిగించిందన్నారు. ఏపీ ప్రజలు గర్వంగా తలెత్తుకుని బతకాలనేది నా ఆశయమని పవన్ స్పష్టం చేశారు. తనకు పదవులపై ఆశ వుంటే 2009లోనే పదవిలో వుండేవాడినని ఆయన పేర్కొన్నారు. ఏపీకి రావాలంటే పాస్‌పోర్ట్ తీసుకునే పరిస్ధితి వచ్చేలా వుందని పవన్ దుయ్యబట్టారు. 

వైసీపీ నవరత్నాల్లో చెప్పేది ఒకటి, చేసేది మరొకటని పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు . కొనకళ్ల నారాయణపై దాడి చూసి సాటి ఆంధ్రుడిగా బాధపడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీని విలీనం చేసి అవన్నీ ప్రభుత్వ ఉద్యోగాలు అంటారా అని పవన్ దుయ్యబట్టారు. కృత్తివెన్ను మండలంలో అక్రమంగా రొయ్యల చెరువులు వేశారని ఆరోపించారు. మడ అడవులు ధ్వంసం చేసి చెరువులు తవ్వుతున్నారని పేర్కొన్నారు. పెడన, అవనిగడ్డ, బందరును చతుర్ముఖ నగరంగా అభివృద్ధి చేస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 

వైసీపీ అక్రమాలను అడ్డుకున్నందుకు ఈ ప్రాంతానికి చెందిన జనసైనికులను అంబేద్కర్ విగ్రహానికి కట్టేసి కొట్టారని ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు నుంచి వెళ్లాలన్నా.. జనసైనికులు నమస్కారం పెట్టి వెళ్లాలనే నిబంధనలు వున్నాయని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014లో రాష్ట్రం కోసం టీడీపీ, బీజేపీ కూటమికి మద్ధతు పలికానని.. ఈసారి వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే మరోసారి తెలుగుదేశంతో కలిసి వస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

అక్రమ తవ్వకాలను అడ్డుకుంటే అక్రమ కేసులు, హత్యా కేసులు పెడుతున్నారని.. స్థానిక ఎమ్మెల్యే జోగి రమేశ్ అన్నింటా అవినీతికి పాల్పడ్డారని పవన్ ఆరోపించారు. జగన్ చెప్పిన 28 లక్షల ఇళ్లు ఎక్కడ వున్నాయో.. ఏమయ్యాయో నంటూ పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు. మోపిదేవి సుబ్రమణ్యస్వామి ఆశీస్సులతో వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేద్దామని పవన్ పిలుపునిచ్చారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios