తండ్రి ఒకరకంగా అప్పట్లో వార్తల్లోకి ఎక్కితే కొడుకు ఇపుడు వార్తల్లో వ్యక్తయ్యాడు. ఇంతకీ ఎవరా తండ్రీ, కొడుకులనుకుంటున్నారా? వారేనండి బికామ్ లో ఫిజిక్స్ చదివిన వైసిపి ఫిరాయింపు ఎంఎల్ఏ జలీల్ ఖాన్. ఫిరాయింపు ఎంఎల్ఏ కొడుకు సాహూల్ ఖాన్. ఇంతకీ సాహూల్ ఖాన్ ఎందుకు వార్తల్లో వ్యక్తయ్యాడంటే బుధవారం అర్ధరాత్రి కారు యాక్సిడెంట్లో ఇరుక్కున్నాడు. విజయవాడలోని ఓ బజారులో అర్ధరాత్రి కారును అతివేగంగా నడిపి ఓ వ్యక్తిని ఢీ కొన్నాడు. దాంతో వ్యక్తికి తీవ్రమైన గాయాలయ్యాయి.

సరే, గాయాలైన వ్యక్తిని ఆసుపత్రిలో చేర్చారు అక్కడున్న వాళ్ళు. కారు నడిపింది సాహూల్ ఖానే అంటూ బాధితుడు ఫిర్యాదు చేశారు. అయితే, తాను కారు నడపలేదని, తన స్నేహితుడు నడిపాడని సాహూల్ వాదిస్తున్నారు. ఈ విషయంలో పోలీసులు రంగ ప్రవేశం చేసారు.  విచారిస్తే కారులోని వారి వద్ద మద్యం వాసన గుప్పుమన్నది. ప్రమాదానికి కారకులైన వారిని అదుపులోకి తీసుకునే సమయంలో సాహూల్ పోలీసులతో పెద్ద వాగ్వాదానికి దిగి  నడిరోడ్డుపైన పెద్ద గొడవే పడ్డాడు. అయితే, విషయం తెలిసి మీడియా వాళ్లు అక్కడకి రావటంతో ఏం చేయాలో తెలీక చప్పుడు చేయకుండా వెళ్ళిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారనుకోండి అది వేరే సంగతి.