మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లైంది చంద్రబాబునాయుడు పరిస్ధితి. అసలే బడ్జెట్ కష్టాలు, ప్రత్యేకహోదా వేడి, మిత్రపక్షం బిజెపి నేతల మాటల దాడులు, జనాల్లో పెరిగిపోతున్న ఆగ్రహం చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అటువంటి నేపధ్యంలో హటాత్తుగా ఓ ఫిరాయింపు ఎంఎల్ఏ మీడియాతో మాట్లాడుతూ, తాను అమ్ముడుపోయినట్లు పెద్ద బాంబు పేల్చారు.

వైసిపిలో గెలిచి టిడిపిలోకి ఫిరాయించిన ఎంఎల్ఏ సంచలన ప్రకటన చేశారు. కర్నూలు జిల్లా కోడుమూరు ఫిరాయింపు ఎంఎల్ఏ మణిగాంధి  ఏమని చెప్పారంటే ‘చంద్రబాబునాయుడు చేస్తున్న అభివృద్ధిని చూసి టిడిపిలో చేరుతున్నాట్లు చెబుతున్నది అబద్దాలే’ అంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ‘తాను మిగిలిన ఫిరాయింపులు చెబుతున్నట్లు అబద్దాలు చెప్పి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసుకోలేను’ అంటూ చెప్పారు.

‘తాను టిడిపికి అమ్ముడుపోయానం’టూ పెద్ద బాంబు పేల్చారు. తనకు మిగిలిన వాళ్ళలాగ అబద్దాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. పోయిన ఎన్నికల్లో తనకు 53 వేల ఓట్ల మెజారిటీ వచ్చిందన్నారు. చంద్రబాబుకన్నా తనకే మెజారిటీ ఎక్కువని తెలిపారు. ప్రలోభాలకు లొంగిపోయి వైసిపిలో గెలిచిన తాను టిడిపిలోకి ఫిరాయించి రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకున్నట్లు ఆవేధన వ్యక్తం చేయటం గమనార్హం. కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జి విష్ణువర్ధన్ రెడ్డితో తనకు ఏమాత్రం పొసగటం లేదన్నారు.

కడప జిల్లాలోని బద్వేలు ఫిరాయింపు ఎంఎల్ఏ జయరాములు పరిస్ధితి కూడా తనకు లాగే తయారైందంటూ మరో విషయం చెప్పారు. టిడిపిలో తామిద్దరమూ ఇమడలేకపోతున్నట్లు చెప్పారు. త్వరలో తామిద్దరమూ టిడిపికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నామన్నారు. 6 నెలలు ఓపికిపడితే రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయని జోస్యం చెప్పారు. పరిస్ధితి ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో తను ఓటమి తప్పదని మణిగాంధి అంగీకరించారు.