ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తర్వాత పోయిన ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు, వాటి అమలుపై పెద్ద ఎత్తున  చర్చ మొదలైంది. పోయిన ఎన్నికల్లో గెలుపే లక్ష్యంతో  చంద్రబాబు చాలా హామీలనే ఇచ్చారు. అందులో రైతు, డ్వాక్రా, చేనేత రుణాల మాఫీ ప్రధానం. దానికి తోడు కాపులను బిసిల్లోకి చేర్చటమనే రాజకీయ హామీ కూడా ఉందండోయ్. ఇక, ఇంటికో ఉద్యోగం, కుదరకపోతే ప్రతీ నిరుద్యోగికీ నెలకు రూ. 2 వేల భృతి లాంటి హామాలు చాలానే ఉన్నాయ్ లేండి.

అన్నిహామీలను ఎందుకిచ్చారు చంద్రబాబు? అంటే, అప్పటికే పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నారు కదా. మళ్ళీ ఇంకో ఐదేళ్ళంటే పార్టీని నడపటం కష్టమే. వయసు అయిపోతోంది. నేతలు పార్టీలో ఎక్కువ రోజులుండరు. పైగా అప్పట్లో పార్టీ పరిస్ధితి కూడా పెద్దగా బావోలేదు. ఇలా...చాలా ఆలోచించుకున్న చంద్రబాబు వెంటపడి మరీ నరేంద్రమోడితో పొత్తు పెట్టుకున్నారు. సినీనటుడు పవన్ కల్యాణ్ ను ఒత్తిడిపెట్టి  తమ పార్టీకి ప్రచారం చేసేట్లు ఒప్పించారు.

సరే ఎన్ని ప్రయత్నాలు చేసినా గెలుపుపై ఎక్కడో అనుమానం. అందుకనే ఉచిత హామీలను చాలా ఇచ్చారు. మొత్తానికి అధికారమైతే దక్కింది. తర్వాత సమస్యలు మొదలయ్యాయి. అలవికాని హామీలిచ్చిన చంద్రబాబుకు వాటి అమలుకు నిధుల సమస్య పెద్ద అవరోధంగా తయారైంది. అందుకే తానిచ్చిన ఉచిత హామీలను జనాలు అడగకుండా ఎవరికీ అర్ధం కాని లెక్కలను చెబుతున్నారు. రుణాల రద్దు హామీ ఎంత వరకూ అమలైందంటే అధికార పార్టీ ఎంఎల్ఏలే సరిగా చెప్పలేని పరిస్ధితి. అయితే, ప్రతిపక్షం ఊరుకుంటుందా? చంద్రబాబు హామీలను, వాటి అమలును పదే పదే ప్రజల్లో చర్చకు పెడుతోంది. తాజాగా బడ్జెట్ సమావేశాల్లో ఏకిపారేస్తోంది. చంద్రబాబు వరస చూస్తుంటే చివరకు తానిచ్చిన ‘హామీలనే మాఫీ’ చేస్తారేమోనని అందరూ అనుమానిస్తున్నారు.