కృష్ణానదిలో ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద ఆదివారం రాత్రి జరిగిన బోటు ప్రమాదంలో ప్రభుత్వ నిర్లక్ష్యమే స్పష్టంగా కనబడుతోంది. ఎందుకంటే, ఫెర్రీలో తిరిగుతున్న బోట్లలో ఎన్నింటికి అనుమతులున్నాయన్న విషయంపై వివాదం మొదలైంది. ప్రమదానికి గురైన బోటుకు అక్కడ తిరగటానికి అసలు అనుమతే లేదట. అనుమతి లేకుండా ఇంతకాలం పవిత్రసంగమంలో పెద్ద బోటు తిరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నట్లు? టూరిజం శాఖ మంత్రి, ఉన్నతాధికారులు ఏం చేస్తున్నట్లు?

రాష్ట్రంలో ఎక్కడ వీధిలైటు వెలుగుతున్నా, ఆరిపోయినా తనకు సిఎం డ్యాష్ బోర్డులో ఇట్టే తెలిసిపోతుందని చంద్రబాబునాయుడు తరచూ చెబుతుంటార కదా? మరీ తాను నివాసముండే ప్రాంతంలలోనే ఇంత పెద్ద ప్రమాదానికి కారణమైన బోటు ఎటువంటి అనుమతి లేకుండానే ఇంతకాలం నుండి తిరుగుతుంటే చంద్రబాబుకు ఆ విషయం ఎందుకు తెలియలేదు?

పవిత్ర సంగమంలో నీటి లభ్యత మీదే కదా బోట్లు తిరగటానికి అధికారులు అనుమతులిస్తారు. మరి, తిరుగుతున్న బోట్లెన్ని? ఎన్నింటికి అనుమతులున్నాయి అన్న విషయాన్ని అధికారులు ప్రతీ రోజు లెక్క చూసుకోవాల్సిందే కదా? అనుమతి లేని బోటు తిరుగుతోందంటే ఎవరికీ తెలియకుండానే తిరుగుతోందా? ఘటన జరగ్గానే దిగ్ర్భాంతి వ్యక్తం చేయటం, విచారణకు ఆదేశించటం కాదు చేయాల్సింది. ముందు పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ బాధ్యత తీసుకోవాలి? తర్వాత విచారణ.

ఆదివారం సాయంత్రం ప్రమాదం జరిగినపుడు బోటులో సుమారు 40 మంది ఉన్నారని చెబుతున్నారు. అందులో 17 మంది చనిపోయారు. జె. ప్రభాకర్‌రెడ్డి, కోటేశ్వరరావు, పసుపులేటి సీతారామయ్య, పసుపులేటి అంజమ్మ, సీతారామయ్య మనవరాలు, వాకా కోటిరెడ్డి, కోటిరెడ్డి భార్య, కోటిరెడ్డి మనవరాలు, ఆంజనేయులు, ఆంజనేయులు భార్య, వెంకటేశ్వర్లు, నారాయణరాజు, క్రోసూరి రమ. ప్రమాదం నుండి 16 మంది బయటపడ్డారు. అయితే వీరిలో 6 గురు పరిస్ధితి సీరియస్ గా ఉందని అధికారులు చెబుతున్నారు. మరో 7 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు జరుపుతున్నారు.