దాన్ని జగన్ కాదు ఆయన తాత రాజారెడ్డి కూడా అడ్డుకోలేడు: టిడిపి అనిత సంచలనం
దళిత ప్రతిఘటన ర్యాలీని అడ్డుకోవచ్చు... కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దళితుల ప్రతిఘటనను మాత్రం జగన్ కాదు ఆయన తాత రాజారెడ్డి కూడా అడ్డుకోలేడని టిడిపి నాయకురాలు అనిత హెచ్చరించారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. పోలీసు వ్యవస్ధను నిందితుల్ని శిక్షించడానికి కాకుండా టీడీపీ నేతల్ని ఇబ్బందులు పెట్టడానికి ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ పాలనలో దళితులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలపై నిరసన తెలపడానికి టీడీపీ చేపట్టిన దళిత ప్రతిఘటన ర్యాలీని అడ్డుకోవటం దుర్మార్గమని అనిత అన్నారు.
''దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే ఎందుకు ముఖ్యమంత్రి అడ్డుకోలేకపోతున్నారు? నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? దళిత ప్రతిఘటన ర్యాలీని అడ్డుకున్నారంటే జగన్ రెడ్డి దళితులకు జరుగుతున్న అన్యాయాల్ని సమర్ధిస్తున్నారా? లేక దళితులకు న్యాయం చేయలేమని చేతులెత్తేశారా?'' అని అనిత నిలదీశారు.
''ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపే వారిపై కోవిడ్ నిభంధనల పేరుతో కేసులు పెడుతున్న ప్రభుత్వానికి వైసీపీ నేతల బహిరంగ సభలు, ర్యాలీలు, నాయకుల పుట్టిన రోజు పార్టీల సమయంలో కోవిడ్ నిబంధనలు గుర్తుకురావా? దళితుల్ని ఉద్దరిస్తున్నామంటున్న వైసీపీ దళిత ప్రతిఘటన ర్యాలీని అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి?'' అని అడిగారు.
read more దళిత ప్రతిఘటన ర్యాలీని నిలువరించామనుకుంటే పొరపడినట్టే: జగన్ సర్కార్ కు జవహర్ వార్నింగ్
''మాస్కు అడిగిన పాపానికి డా. సుధాకర్ ని హింసించి ఆత్మహత్యకు పాల్పడేలా ప్రేరేపించింది వైసీపీ ప్రభుత్వం కాదా? మాస్కు పెట్టుకోలేదని పోలీసుల చేత దళిత యువకుడు కిరణ్ ని కొట్టించి చంపలేదా? టీడీపీ నేతల్ని ఇబ్బందులకు పెట్టడానికి పోలీసులను ఉపయోగిస్తున్న ప్రభుత్వం దళితులపై దాడి చేసి వారిపై చర్యలు తీసుకోవటానికి ఎందుకు ఉపయోగించటం లేదు? ఈ రెండున్నరేళ్లలో దళితులపై జరిగిన దాడుల్లో ఎంతమందిపై చర్యలు తీసుకున్నారో డీజీపీ శ్వేతపత్రం విడుదల చేయగలరా?'' అని అనిత నిలదీశారు.
''పోలీసులు మీ అధికారం చూపాల్సింది శాంతియుతంగా నిరసన చేస్తున్న దళిత నేతలపై కాదు.. దళితులపై దాడి చేసే వారిని శిక్షించటంలో చూపండి. ఎస్సీ, ఎస్టీ కేసులను ఎస్సీలపైనే పెట్టి ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఒక్క జగన్ రెడ్డి మాత్రమే. వివేకాందరెడ్డి హత్య కేసులో ఎస్సీ, ఎస్టీ చట్టం వర్తించదని ఆ కేసు పెట్టలేదు తప్ప లేకపోతో దానికి కూడా అట్రాసిటీ చట్టాన్ని వాడే వారు'' అని ఎద్దేవా చేశారు.
''అధికార బలం, పోలీసుల అండతో నేడు దళిత ప్రతిఘటన ర్యాలీని అడ్డుకోవచ్చేమో కానీ వచ్చే ఎన్నికల్లో వైసీపీకీ వ్యతిరేకంగా ఓట్ల రూపంలో జరిగే దళిత ప్రతిఘటనను మాత్రం జగనే కాదు ఆయన తాత రాజారెడ్డి దిగివచ్చినా అడ్డుకోలేరు. ప్రభుత్వం ఎంత అణిచివేయాలని చూసినా దళితులకు జరుగుతున్న అన్యాయంపై టీడీపీ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుంది'' అని వంగలపూడి అనిత స్పష్టం చేశారు.