ఇప్పుడు వారు సమాధానం చెప్పాలి..: అమిత్ షాతో లోకేష్ భేటీపై పురందేశ్వరి
కేంద్ర హోం మంత్రి అమిత్ షాను తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం కలిశారు. అమిత్ షాతో లోకేష్ భేటీ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు

కేంద్ర హోం మంత్రి అమిత్ షాను తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం కలిశారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ కేసులో రెండు రోజుల సీఐడీ విచారణ అనంతరం బుధవారం సాయంత్రం లోకేశ్ ఢిల్లీకి వెళ్లారు. రాత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు దగ్గుబాటి పురందేశ్వరి, కిషన్ రెడ్డిలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ప్రాణహాని ఉందని లోకేష్ ఆందోళన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది.
చంద్రబాబును అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసారని అమిత్ షాకు లోకేష్ ఫిర్యాదు చేసారు. అలాగే తనను కూడా కేసుల్లో ఇరికించి విచారణ పేరుతో వేధిస్తున్నారని చెప్పారు. చివరకు తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణిని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అలాగే వైసీపీ ప్రతీకార రాజకీయాలను, ప్రభుత్వ యంత్రాంగం దుర్వినియోగంపై కూడా అమిత్ షాకు తెలిపినట్టుగా లోకేష్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
అయితే అమిత్ షాతో లోకేష్ భేటీ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. చంద్రబాబు అరెస్ట్‌లో కేంద్రం హస్తం ఉందని నిందలు వేసేవారు ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం, అధికార పార్టీ నేతల ప్రతీకార చర్యలను అమిత్ షాకు లోకేష్ వివరంగా తెలియజేశారు. అరెస్టు వెనుక బీజేపీ హస్తం ఉంటే లోకేష్‌కు అమిత్ షా ఎందుకు అపాయింట్‌మెంట్ ఇస్తారో.. కేంద్రంపై నిందలు వేసే వారు ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది’’ అని పురందేశ్వరి పేర్కొన్నారు.