బీజేపీ బలోపేతం కోసం కృషి చేస్తా:జేపీ నడ్డాతో పురంధేశ్వరీ భేటీ
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరీ భేటీ అయ్యారు.
న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరీ గురువారంనాడు న్యూఢిల్లీలో భేటీ అయ్యారు.రెండు రోజుల క్రితం బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురంధేశ్వరీని ఆ పార్టీ నాయకత్వం నియమించిన విషయం తెలిసిందే. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన తర్వాత పురంధేశ్వరి నడ్డాను కలవడం ఇదే ప్రథమం.
మర్యాద పూర్వకంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసినట్టుగా పురంధేశ్వరీ ప్రకటించారు. ఏపీ అభివృద్ది కోసం తాను ప్రయత్నిస్తానని ఆమె చెప్పారు. తనపై నమ్మకం ఉంచి పార్టీ బాధ్యతలు అప్పగించిన జాతీయ నాయకత్వానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేస్తామని పురంధేశ్వరీ చెప్పారు.
వచ్చే ఏడాదిలో ఏపీ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దక్షిణాదిలో అత్యధికంగా లోక్ సభ స్థానాలను దక్కించుకొనేందుకు బీజేపీ ప్లాన్ చేస్తుంది. దరిమిలా సంస్థాగతంగా బీజేపీ నాయకత్వం పార్టీలో మార్పులు, చేర్పులకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన బీజేపీ అధ్యక్షులను మార్చింది. తెలంగాణలో బండి సంజయ్ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. సోము వీర్రాజును తప్పించి ఆ స్థానంలో పురంధేశ్వరీకి బాధ్యతలను అప్పగించింది బీజేపీ నాయకత్వం.
also read:బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు: సోము వీర్రాజుకు జేపీ నడ్డా ఫోన్
బీజేపీ నాయకత్వం పురంధేశ్వరిని అధ్యక్షురాలిగా ప్రకటించిన సమయంలో ఆమె అమర్ నాథ్ యాత్రలో ఉన్నారు. అమర్ నాథ్ యాత్ర నుండి తిరిగి వచ్చిన తర్వాత పురంధేశ్వరీ జేపీ నడ్డాను కలిశారు.బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సోము వీర్రాజుకు మరో బాధ్యతను అప్పగించనుంది పార్టీ నాయకత్వం. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కాకపోవడానికి సోము వీర్రాజు వైఖరి కూడ కారణంగా ప్రచారంలో ఉంది. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పార్టీ వీడటానికి సోము వీర్రాజు వైఖరే కారణమని ఆయన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.