బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు: సోము వీర్రాజుకు జేపీ నడ్డా ఫోన్
బీజేపీ ఏపీ అధ్యక్షుడిని మార్చాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై సోము వీర్రాజుకు జేపీ నడ్డా ఫోన్ చేసి చెప్పారు.
న్యూఢిల్లీ: బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిని ఆ పార్టీ అధిష్టానం మార్చింది. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజును ఆ పార్టీ నాయకత్వం తప్పించనుంది. ఈ విషయాన్ని సోము వీర్రాజుకు జేపీ నడ్డా ఫోన్ చేసి చెప్పారు.తనకు పార్టీలో కొత్త బాధ్యతలు ఇస్తానని జేపీ నడ్డా హామీ ఇచ్చారని సోము వీర్రాజు వివరించారు.సత్యకుమార్ తో పాటు మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేరును కూడ బీజేపీ నాయకత్వం పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. ఇవాళ సాయంత్రం బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడి పేరును ప్రకటించే అవకాశం ఉంది.
2020లో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే పార్టీ నాయకత్వం తీరుపై హైకమాండ్ అసంతృప్తితో ఉంది. బీజేపీకి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ ఇటీవలనే పార్టీ నుండి బయటకు వచ్చారు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ సోము వీర్రాజు కు ఫోన్ చేశారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తప్పిస్తున్నట్టుగా జేపీ నడ్డా ఫోన్ లో చెప్పారు. అంతేకాదు పార్టీలో మరో బాధ్యతను అప్పగిస్తామని నడ్డా హామీ ఇచ్చినట్టుగా సోము వీర్రాజు మీడియాకు చెప్పారు.బీజేపీ అధ్యక్ష పదవిలో మీ పదవీ కాలం ముగిసింది, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని జేపీ నడ్డా తనకు చెప్పారని సోము వీర్రాజు వివరించారు.
also read:జేపీ నడ్డాతో బండి సంజయ్ భేటీ: తాజా రాజకీయాలు, సంస్థాగత వ్యవహారాలపై చర్చ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో ఏపీ రాజకీయ సమీకరణాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షాతో ఇటీవలనే టీడీపీ చీఫ్ చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత బీజేపీ నేతలు టీడీపీపై విమర్శల పదును తగ్గింది. దీంతో రానున్న ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ మధ్య మైత్రి కుదురుతుందా అనే చర్చ కూడ సాగుతుంది. ఈ తరుణంలో సోము వీర్రాజును బీజేపీ అధ్యక్ష పదవి నుండి తప్పించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
వచ్చే ఏడాదిలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో మెజారిటీ ఎంపీ స్థానాలను దక్కించుకొనేందుకు గాను బీజేపీ నాయకత్వం కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలోనే పార్టీ అధ్యక్షులను మార్పులను చేస్తుంది. మరో వైపు కేంద్ర కేబినెట్ లో కూడ మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది