బంగాళాఖాతాన్ని వణికిస్తున్న ఫణి తుఫాను మంగళవారం రాత్రికి పెను తుఫానుగా మారింది.  గంటకు 6-12 కిలోమీటర్ల వేగంతో సోమవారం వరకు పయనించిన ఫణి మంగళవారం నుంచి రెట్టింపు వేగంతో కదులుతూ ఒడిశా వైపు దూసుకెళ్తోంది.

ప్రస్తుతం విశాఖకు దక్షిణ, ఆగ్నేయ దిశగా 510 కిలోమీటర్ల దూరంలో .. పూరికి దక్షిణ నైరుతి దిశగా 730 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. వాయువ్య దిశగా పయనిస్తున్న ఈ పెను తుఫాను బుధవారం ఉదయానికి దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్య దిశ వైపు పయనించనుంది.

క్రమంలో అదే దిశలో కదులుతూ ఒడిశాలోని గోపాల్‌పూర్-చాంద్‌బాలీల మధ్య దక్షిణ పూరీకి సమీపంలో మూడో తేదీ మధ్యాహ్నం ‘ఫణి’ తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అనంతరం క్రమంగా పశ్చిమ బెంగాల్ మీదుగా పయనించి మే 5న బంగ్లాదేశ్‌లో వాయుగుండంగా బలహీనపడనుందని వివరించింది.

తుఫాను తీరాన్ని దాటే సమయంలో గంటకు 170-205 కిలోమీటర్ల వేగంతో బలమైన పెనుగాలులు వీస్తాయని.. తమిళనాడు, పుదచ్చేరి, దక్షిణ, ఉత్తర కోస్తాలలో దీని ప్రభావం అధికంగా ఉంటుందని ఐఎండీ తెలిపింది.

ఫణి ఏకంగా నాలుగు రోజుల పాటు కొనసాగుతుండటం వల్ల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై ప్రభావం చూపుతుందని అధికారులు తెలిపారు.

తుఫాను నేపథ్యంలో సహాయక చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని మండలాల్లోనూ ప్రత్యేక అధికారులను నియమించడంతోపాటు .. ప్రజలను అప్రమత్తం చేశారు.

15 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అగ్నిమాపకశాఖకు చెందిన 34 సహాయ దళాలు సిద్ధంగా ఉంచినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహిణ సంస్థ తెలిపింది. చెట్లు కూలితే వెంటనే తొలగించేందుకు 116 బృందాలను సిద్ధం చేశారు.

అవసరమైతే మందులు, ఆహారం, రబ్బరు బోట్లు, టెంట్లు, నౌకలు, ఇతర సామాగ్రిని అందించడానికి వీలుగా విశాఖలో ఐఎన్ఎస్ డేగాను సిద్ధం చేసినట్లు తూర్పు నావికాదళం ప్రకటించింది. అమరావతిలోని ఆర్టీజీఎస్ తుఫాను, ఇతర చర్యలను నిఘా కెమెరాల ద్వారా గమనిస్తూ అధికార యంత్రాంగానికి పలు సూచనలు చేస్తోంది.