బంగాళాఖాతంలో ఏర్పడిన ఆసనీ తుపాను బలహీనపడినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. అయినప్పటికి ఏపీకి మాత్రం ఈ తుపాను ముప్పు పొంచివుండటంతో ఆయా జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటుచేసారు.
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన 'అసని' తుపాను బలహీనపడినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. తీవ్ర తుపాను కాస్త తుపానుగా బలహీనపడినట్లు తెలిపారు. రేపు ఉదయానికి ఇది వాయుగుండంగా బలహీనపడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఆసనీ తుపాను గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో పశ్చిమవాయువ్య దిశగా కదిలింది. ప్రస్తుతం తుపాను మచిలీపట్నంకు 60 కిమీ, కాకినాడకు 180 కిమీ, విశాఖపట్నంకు 310 కిమీ, గోపాలపూర్ కు 550 కిమీ, పూరీకు 630 కిమీ దూరంలో కేంద్రీకృతమై వున్నట్లు తెలిపారు. మరికొన్ని గంటల్లో వాయువ్య దిశగా పయనించి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం వుందని తెలిపారు. ఆ తర్వాత ఉత్తరం-ఈశాన్య దిశగా కదులుతూ మచిలీపట్నం, నర్సాపూరం, యానాం, కాకినాడ, తుని, విశాఖపట్నం తీరాల వెంబడి వెళుతూ సాయంత్రానికి మధ్య బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశముందని తెలిపారు.
ఈ ఆసనీ తుపాను ప్రభావంతో ఇవాళ ఉమ్మడి కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీవర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 75-95 కిమీ వేగంతో ఈదురగాలులు వీస్తాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు 9 SDRF, 9 NDRF బృందాలు రంగంలోకి దిగాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ డైరెక్టర్ డా.బిఆర్ అంబేద్కర్ హెచ్చరించారు.
ఆసనీ తుపాను ప్రభావిత జిల్లాల యంత్రాంగాన్ని విపత్తుల శాఖ అప్రమత్తం చేసింది. తుపాను ప్రభావిత మండలాలకు ప్రత్యేక అధికారులుగా డిప్యూటీ కలెక్టర్లను నియమించారు లోతట్టు ప్రాంతాల్లో తుపాను సమాచారాన్ని మైకుల ద్వారా తెలియజేస్తున్నారు. తీవ్ర తుపాను దృష్ట్యా వివిధ శాఖల సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. సహాయక చర్యలకు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, నేవీ, కోస్ట్‌గార్డు బృందాలు సిద్ధంగా వున్నాయి.
ఇక తుపాను సహాయక సహాయక చర్యలకోసం కంట్రోల్ రూమ్స్ ఏర్పాటుచేసారు. విశాఖ జిల్లా ప్రజల సహాయార్థం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం లు ఏర్పాటుచేసారు. ఈ కంట్రోల్ రూమ్ నంబర్ 1800 425 00002, 0891-2590100, 2590102, 2560820. విశాఖ జీవీఎంసీ కార్యాలయంలో హెల్ప్ లైన్ నంబర్: 1800 4250 0009, 0891 2869106
తుపాను సహాయ కేంద్రాల్లో ఆహార పదార్థాలు, తాగునీరు, జనరేటర్ సిద్ధం చేసారు. సముద్రం అల్లకల్లోలంగా వున్న నేపథ్యంలో విశాఖ బీచ్ సందర్శనకు పర్యాటకులకు అనుమతించడం లేదు. పర్యాటకులు రాకుండా విశాఖ బీచ్ వద్ద పోలీసుల పహారా కాస్తున్నారు. విశాఖ ఈపీడీసీఎల్ పరిధిలో రెస్క్యూ మేనేజ్‌మెంట్ బృందం సిద్ధంగా వుంది. విశాఖ తూర్పు నావికాదళం కూడా సహాయక చర్యల కోసం సిద్ధమయ్యింది.
తుపాను హెచ్చరికలతో అప్రమత్తమైన కాకినాడ జిల్లా యంత్రాంగం కూడా సిద్దమయ్యింది. కాకినాడ కలెక్టరేట్ తో పాటు కాకినాడ, పెద్దాపురం ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటుచేసారు. కలెక్టర్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నంబర్ 1800-425-3077, కాకినాడ ఆర్డీవో కార్యాలయం నంబర్ 0884-2368100, పెద్దాపురం ఆర్డీవో కార్యాలయం నంబర్ 96036 63327, కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నం.1800 425 0325. తుపాను ముప్పు ముగిసే వరకూ ఈ కంట్రోల్ రూమ్‌లు అందుబాటులో వుండనున్నాయి.
తుపాను దృష్ట్యా కోనసీమ ప్రజలను ఆయా జిల్లాల యంత్రాంగం అప్రమత్తం చేసారు. అంతర్వేది, ఓడలరేవు, కాట్రేనికోన తీరాలపై తీవ్ర తుపాను ప్రభావం వుండనుంది. కోనసీమ జిల్లావ్యాప్తంగా భీకర గాలులు, వర్షాలు కురిసే అవకాశం వుంది. దీంతో అమలాపురం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ నం. 0885 6293104.
బాపట్ల కలెక్టరేట్ తో పాటు అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటుచేసారు. నిజాంపట్నం హార్బర్‌లో 8వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసారు. బాపట్ల జిల్లాలోని సముద్రతీర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసారు. బాపట్ల కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ నెంబర్లు 8712655878, 8712655881, 8712655918
శ్రీకాకుళం జిల్లాలో ఆసనీ తుఫాను ప్రభావం ఎక్కువగా వుండనుంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ అప్రమత్తం చేసారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ నంబర్ 08942-240557. జిల్లాలోని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో కూడా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటుచేసారు.
విజయనగరం జిల్లా యంత్రాంగం తుపాను దృష్ట్యా అప్రమత్తమయ్యింది. విజయనగరం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ నం. 08922-236947. విజయనగరం ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నం. 08922-276888. చీపురుపల్లి ఆర్డీవో కార్యాలయంలో నంబర్లు 94407 17534, 08944-247288. భోగాపురం తహశీల్దార్ కార్యాలయంలో నంబర్లు 80744 00947, 70367 63036.
ఆసనీ తుపాను దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే 37 రైళ్లు రద్దు చేసింది. విజయవాడ-మచిలీపట్నం, మచిలీపట్నం-విజయవాడ రైళ్లు రద్దయ్యాయి. విజయవాడ-నర్సాపూర్, నర్సాపూర్-విజయవాడ, నర్సాపూర్-నిడదవోలు, నిడదవోలు-నర్సాపూర్ రైళ్లు రద్దయ్యాయి. భీమవరం జంక్షన్-నిడదవోలు, మచిలీపట్నం-విజయవాడ, విజయవాడ-భీమవరం జంక్షన్ రైలు రద్దయ్యాయి. మరికొన్ని రైళ్లను రీ-షెడ్యూల్ చేసింది రైల్వేశాఖ.
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు సర్వీసులు రద్దయ్యాయి. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ప్రధాన సర్వీసులు రద్దుచేసినట్లు ఇండిగో ప్రకటించింది. విశాఖ, రాజమహేంద్రవరం, కడపకు నడిచే లింక్ సర్వీసులు నిలిపివేసారు. వాతావరణ మార్పుల అనంతరం సర్వీసులు పునరుద్ధరిస్తామని ఇండిగో వెల్లడించింది.
