ఏపి రాజకీయాల్లో త్వరలో మరో సంచలనానికి తెరలేవనున్నదా? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. తొందరలోనే ప్రధానమంత్రి నరేంద్రమోడి-వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మధ్య భేటీ జరిగే అవకాశాలున్నట్లు సమాచారం. ఢిల్లీలో జగన్ తరపున కీలకంగా వ్యవహరిస్తున్న ఓ ఎంపి ప్రధాని అపాయిట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారట. అవకాశం దొరికితే పాదయాత్ర మధ్యలోనే మోడిని జగన్ కలిసే అవకాశాలున్నాయి.

ఎప్పుడైతే ప్రధాని అపాయిట్మెంట్ కోసం ఓ ఎంపి ప్రయత్నిస్తున్నారని తెలిసిందో టిడిపి నేతల్లో ఆందోళన మొదలైంది. ఎటుతిరిగి బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయ. కాబట్టి కేంద్రమంత్రులకు, ఎంపిలకు ప్రధాని దాదాపు అందుబాటులోనే ఉంటారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మోడి-జగన్ భేటీకి రంగం సిద్ధం చేయాలని సదరు ఎంపి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం.

కొంతకాలంగా టిడిపి-భాజపాల మధ్య సంబందాలు క్షీణించిన సంగతి అందరికీ తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఒంటిరి పోటీకి భాజపాలోని కొందరు నేతలు గట్టిగ పట్టుబడుతున్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రం ఏ దశలోనూ చంద్రబాబునాయుడుకు సహకరించలేదు. దాంతో మూడున్నరేళ్ళ పాలపై జనాల్లో వ్యతిరేకత మొదలైపోయింది. ఇదే పరిస్ధితుల్లో వచ్చే ఎన్నికల్లో జనాల ముందుకు ఓట్ల కోసం వెళితే ఫలితం ఎలాగుంటుందో అన్న ఆందోళన చంద్రబాబులో పెరిగిపోతోంది.

ఈ నేపధ్యంలోనే అవకాశం వచ్చినపుడు భాజపాను వదిలించుకోవాలని చంద్రబాబు వ్యూహాలు పన్నుతున్నట్లు అనుమానాలు మొదలయ్యాయి. అందులో భాగమే పదే పదే పొత్తు విచ్చితిపై చంద్రబాబు బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. కాబట్టి పొత్తుల విషయంలో చంద్రబాబు మనసులోని మాటేంటో అర్ధమైపోతోంది.

ఇటువంటి సమయంలోనే భాజపాలోని కొందరు నేతలు వచ్చే ఎన్నికల్లో వైసిపితో పొత్తు విషయంలో సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే జగన్ పాదయాత్రను భాజపా వర్గాలు చాలా నిశితంగా పరిశీలిస్తున్నాయ్. అదే సమయంలో కేంద్రనిఘా అధికారులు కూడా రోజువారీ నివేదికలను కేంద్రానికి అందిస్తున్నారు.

మూడున్నరేళ్ళ పాలనలో సంక్షేమ పధకాల అమలు, ఇరిగేషన్ పథకాల నిర్మాణం తదతరాల విషయంలో చంద్రబాబుపై విపరీతమైన అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ విషయాలను కూడా భాజపాలోని ఒక వర్గం ఎప్పటికప్పుడు తమ కేంద్ర నాయకత్వానికి అందిస్తున్నాయట. సో, ఏ విధంగా చూసుకున్నా వచ్చే ఎన్నికల్లో టిడిపి-భాజపా పొత్తుపై అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. దావోస్ పర్యటన తర్వాత చంద్రబాబు కూడా కేంద్రంపై  మాటల దాడిని పెంచారు.

ఈ నేపధ్యంలోనే జగన్ ప్రధాని అపాయిట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారన్న విషయం సంచలనంగా మారింది.