అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని సీఆర్‌డీఏ‌లో నిర్మిస్తున్న హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టుకు  ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది.  నిమిషాల వ్యవధిలో వందలాది ప్లాట్లను బుక్ చేసుకొన్నారు.

సోమవారం నాడు ఉదయం 9 గంటలకు  ప్లాట్ల బుకింగ్ ప్రారంభమైంది.  ఈ బుకింగ్ ప్రారంభమైన అరగంటలోనే  సుమారు 700కు పైగా ప్లాట్లు బుక్ అయ్యాయి.  సీఆర్‌డీఏ‌ గృహ నిర్మాణ ప్రాజెక్టును హ్యాపీ నెస్ట్‌ పేరుతో  ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఈ ప్లాట్ల బుకింగ్ కోసం  విజయవాడ సీఆర్డీఏ కార్యాలయంలో ప్లాట్లు బుక్ చేసుకొన్నవారికి సంబంధిత బుకింగ్ పత్రాలను సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్  అందించారు. హ్యాపీనెస్ట్ ‌లో ప్లాట్లను బుక్ చేసుకొన్న వారికి 24 నెలల్లోనే  ప్రాజెక్టును పూర్తి చేసి అందిస్తారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి  వారం రోజుల్లోనే  టెండర్లను  ప్రారంభిస్తారు.

ఈ ప్రాజెక్టులో మొత్తం 1200 ఫ్లాట్లు నిర్మిస్తుండగా 300 ఫ్లాట్లకు గత నవంబరు 9న సీఆర్‌డీఏ ఆన్‌లైన్‌లో బుకింగ్‌ నిర్వహించింది. తొలివిడతలో అనూహ్య స్పందన రావడంతో మిగతా 900 ఫ్లాట్లకు సోమవారం బుకింగ్‌ నిర్వహించింది.