పవన్ కల్యాణ్ కొత్తగా ఏర్పాటు చేసిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటి (జెఎఫ్సీ)లో అప్పుడే విభేదాలు మొదలయ్యాయి. జెఎఫ్సీలోని సభ్యుల్లో కొందరు చంద్రబాబునాయుడుకు అనుకూలంగా మాట్లాడుతుంటే, కొందరు మాట్లాడుతున్నది వ్యతరేకంగా కనబడుతోంది. దాంతో జెఎఫ్సీలో అప్పుడే రెండు వర్గాలు తయారయ్యాయి. ఒక్కరోజు సమావేశం ముగిసేటప్పటికే అసలు జెఎఫ్సీ అవసరమేంటి అనే ప్రశ్నలు మొదలైపోయింది.

కొత్తగా ఏర్పడిన జెఎఫ్సీలో వర్గాలెందుకు తయారైంది? అంటే అందుకు పవన్, జయప్రకాశ్ నారాయణ లాంటి వాళ్ళ వైఖరే కారణమని చెప్పక తప్పదు. ముందునుండి కూడా పవన్ కల్యాణ పనిచేస్తున్నది చంద్రబాబునాయుడు కోసమే అనే అనుమానం బలంగా ఉంది. పవన్ వైఖరి కూడా ఎన్నోమార్లు అదే విధంగా స్పష్టమైంది. మళ్ళీ ఇపుడు జెఎఫ్సీ ఏర్పాటు కూడా అదే దారిలో నడుస్తుండటంతో విభేదాలు బయటపడుతున్నాయి.

అసలు సమస్యంతా మూడున్నరేళ్ళుగా కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులే. రాష్ట్రావసరాలకు నిధులిచ్చామని కేంద్రం అంటోంది. ప్రత్యేకించి రాష్ట్రంలో కోసం కేంద్రం ఇచ్చిన నిధులేమీ లేవని ఇపుడు చంద్రబాబు అంటున్నారు. సమస్య అంతా అక్కడే వస్తోంది. ఇద్దరిలో ఎవరో ఒకరు అబద్దాలు చెబుతున్నారన్నది వాస్తవం. సరే, ఆ విషయాలు ఇప్పటికప్పుడు తేలేది కాదు కాబట్టి దాన్ని పక్కన బెట్టి ప్రత్యేకహోదా, రైల్వేజోన్ లాంటి అంశాలపై వైసిపి పట్టుబడుతోంది.

జెఎస్సీలో సభ్యుడైన జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ, రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధుల విషయంలో లెక్కలడక్కూడన్న చంద్రబాబు వాదననే వినిపిస్తున్నారు. దాన్ని ఐవైఆర్ కృష్ణారావు తప్పు పడుతున్నారు. ఇచ్చిన నిధులకు కేంద్రానికి లెక్కలు చెప్పకపోతే మళ్ళీ కేంద్రం నిధులు ఎందుకిస్తుందంటూ వాదన మొదలుపెట్టారు. దాంతో ఇద్దరి వాదనకు మద్దతుగా మిగిలిన సభ్యులు చీలిపోయినట్లు సమాచారం.

నిజానికి పవన్ జెఎఫ్సీ ఏర్పాటులో అర్ధమేలేదు. జరిగిన మూడున్నరేళ్ల కాలం గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. మిగిలిన ఏడాదిన్నర కాలంలో రాష్ట్రానికి కేంద్రం నుండి ఏమి వస్తుందన్నదే ముఖ్యం. ఆ విషయాన్ని పవన్ కూడా వ్యూహాత్మకంగా పక్కన పెట్టేస్తున్నారు. దానికితోడు చంద్రబాబు కూడా రెండు రోజుల క్రితం మాట్లాడుతూ, పవన్ మనవాడే, జెఎఫ్సీ కూడా మనదే అన్న అర్ధం వచ్చేట్లుగా మాట్లాడారు. ఇపుడదే నిజమయ్యేట్లుందని అందరూ అనుకుంటున్నారు.