తన మాట విననందుకే ఎస్ఈసీ రమేశ్ కుమార్‌పై సీఎం జగన్మోహన్ రెడ్డి కక్షగట్టారని విమర్శించారు సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ. రమేశ్ తొలగింపుపై స్పందించిన ఆయన జగన్ ప్రభుత్వానికి పోయే‌కాలం దాపురించిందన్నారు.

మాస్క్‌లు లేవన్నందుకు ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నారని, కరోనా విజృంభిస్తుంటే ఎన్నికలు ఆపించి రమేశ్ మంచి నిర్ణయం తీసుకున్నారని రామకృష్ణ ప్రశంసించారు.

చెప్పినట్లు వింటే రమేశ్ కులం కూడా జగన్‌కు కనిపించేది కాదని, ఆయనను తొలగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఆయన తేల్చిచెప్పారు. ఎస్ఈసీని తొలగించే అధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉందని... ప్రపంచమంతా కరోనాతో చస్తుంటే, జగన్ కొత్త వైరస్‌ను కనిపెడుతున్నారని రామకృష్ణ ఆరోపించారు. 

Also Read:రమేష్ కుమార్ ఉద్వాసనలో మెలిక ఇదీ: జగన్ మీద చంద్రబాబు ఫైర్

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో జారీ చేసింది. అదే విధంగా ఎన్నికల కమిషనర్ నియామకం నిబంధలను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆ ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం లభించింది. 

గవర్నర్ సంతకం చేసిన ఆర్డినెన్స్ ఆధారంగా కమిషనర్ నియామకం నిబంధనలను మారుస్తూ ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. ఆ రెండు జీవోలను కూడా ప్రభుత్వం రహస్యంగా ఉంచింది. 

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో రమేష్ కుమార్ కు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మధ్య తీవ్రమైన విభేదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా స్థానిక సంస్థలను వాయిదా వేశారని జగన్ స్వయంగా రమేష్ కుమార్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 

Also Read:మడమ తిప్పని వైఎస్ జగన్: ఎన్నికల కమిషనర్ గా రమేష్ కుమార్ కు ఉద్వాసన

తనకు రక్షణ కల్పించాలంటూ రమేష్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం కూడా వైఎస్ జగన్ కు తీవ్రమైన ఆగ్రహం తెప్పించింది. అంతేకాకుండా ఆయన తన కార్యాలయాన్ని హైదరాబాదులో కేటాయించిన భవనానికి మార్చుకున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చెలరేగిన హింసపై రమేష్ కుమార్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.