రమేష్ కుమార్ ఉద్వాసనలో మెలిక ఇదీ: జగన్ మీద చంద్రబాబు ఫైర్
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం తొలగించడంపై టీడీపీ అధినేత తీవ్రంగా ప్రతిస్పందించారు. రమేష్ కుమార్ ను తప్పిస్తూ దొడ్డి దారిన జీవో ఎందుకు తెచ్చారని ఆయన ప్రశ్నించారు.
అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్గ రమేష్ కుమార్ ను తొలగించడంపై తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. వైఎస్ జగన్ పై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం గవర్నర్ కు లేఖ రాశారు.
రమేష్ కుమార్ తొలగించడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం తెలివైన మెలిక పెట్టింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించిన నియమనిబంధనలను మారుస్తూ ఆర్డినెన్స్ జారీ చేసి గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత రమేష్ కుమార్ ను తొలగిస్తూ జీవో జారీ చేసింది. మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేయడంతో రమేష్ కుమార్ ను ప్రభుత్వం తొలగించింది.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని ఐదేళ్లుగా నిర్ణయించడం గవర్నర్ ద్వారానే జరిగిందని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీలా కాలన్ని మూడేళ్లకు కుదించడం న్యాయవిరుద్ధమని ఆయన అన్నారు. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంటే రమేష్ కుమార్ ను తొలగిస్తూ దొడ్డిదారిని జీవో ఎందుకు తెచ్చారని ఆయన ప్రశ్నించారు. పదవీ కాలాన్ని తగ్గిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను తొలగించడంపై జోక్యం చేసుకోవాలని ఆయన గవర్నర్ ను కోరారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా ఎన్నికల కమిషనర్ నియామకం నిబంధలను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆ ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం లభించింది.
గవర్నర్ సంతకం చేసిన ఆర్డినెన్స్ ఆధారంగా కమిషనర్ నియామకం నిబంధనలను మారుస్తూ ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. ఆ రెండు జీవోలను కూడా ప్రభుత్వం రహస్యంగా ఉంచింది. రమేష్ కుమార్ ను తొలగించడానికి ప్రభుత్వం మార్గాలను అన్వేషిస్తోందనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తనకు సంక్రమించిన అధికారాల ఆధారంగా కమిషనర్ నియామకం నిబంధలను మారుస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో రమేష్ కుమార్ కు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మధ్య తీవ్రమైన విభేదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా స్థానిక సంస్థలను వాయిదా వేశారని జగన్ స్వయంగా రమేష్ కుమార్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడికి అనుకూలంగా రమేష్ కుమార్ వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇటీవల వాలంటీర్లు ఇళ్లకు వెళ్లి సరుకులు పంపిణీ చేస్తున్నారనే విషయంపై కూడా రమేష్ కుమార్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల పేరు మీద వైసీపీ కార్యకర్తలు ప్రజలను ప్రలోభ పెడుతున్నారని ఆరోపిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఇతర పార్టీల నాయకులు రమేష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు.