హైకోర్టులో వేమూరుకు చుక్కెదురు

court says no exemption to  Andhra Jyothy MD Radhakrishna from personal appearance
Highlights

  • ఒకపుడు కోర్టులో జగన్ కు ఎదురైన అనుభవమే తాజాగా ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణకూ ఎదురైంది.

సేమ్ టు సేమ్. ఒకపుడు కోర్టులో జగన్ కు ఎదురైన అనుభవమే తాజాగా ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణకూ ఎదురైంది. పాదయాత్ర చేస్తున్న నేపధ్యంలో కోర్టు విచారణ నుండి వ్యక్తిగత మినహాయింపు కోరుతూ గతంలో జగన్ వేసిన కేసును సిబిఐ కోర్టు కొట్టేసింది. దాంతో పాదయాత్ర మధ్యలో ప్రతీ శుక్రవారం విరామం తీసుకుని జగన్ కోర్టుకు హాజరవుతున్న విషయం తెలిసిందే. అప్పట్లో ఆ అంశాన్ని రాధాకృష్ణ తన మీడియాలో బాగా హైలైట్ చేశారు.

సీన్ కట్ చేస్తే, ఓ పరువునష్ట దావాలో విచారణ నుండి తనకు వ్యక్తిగత మినహాయింపును కోరుతూ రాధాకృష్ణ హైకోర్టులో దాఖలు చేసిన స్వ్కాష్ పిటీషన్ ను కోర్టు కొట్టేసింది. దీనికి సంబంధించిన వివరాలేంటంటే, ఆమధ్య జగన్ ప్రధానమంత్రి నేంద్రమోడిని కలిసిన సంగతి అందరకీ గుర్తుండే ఉంటుంది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఎంత అవసరమో తాను ప్రధానికి వివరించానంటూ తర్వాత జగన్ స్వయంగా మీడియాతో చెప్పారు. అయితే, దానిపై రాధాకృష్ణ తన సొంత కథనాలు ప్రచురించారు.

రాధాకృష్ణ ప్రచురించిన, ప్రసారం చేసిన కథనాలు తమ నాయకుడు జగన్ పరువుకు నష్ట కలిగించే విధంగా ఉందంటూ వైసిపి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి నాంపల్లి కోర్టులో ఓ కేసు వేసారు. పోయిన నెలలో కేసు విచారణకు వచ్చినపుడు రాధాకృష్ణ కోర్టుకు హాజరుకాలేదు. రాధాకృష్ణ గైర్హాజరుపై కోర్టు మండిపడుతూ ఈనెల 5వ తేదీ అంటే మంగళవారం నాటికి కేసును వాయిదా వేసింది. దాంతో వ్యక్తిగత హాజరు నుండి తనకు మినహాయింపు ఇవ్వాలంటూ రాధాకృష్ణ దాఖలు చేసుకున్న పిటీషన్ పై సోమవారం హైకోర్టు విచారణ జరిపి పిటీషన్ ను కొట్టేసింది. అంటే మంగళవారం నాంపల్లి కోర్టులో జరిగే విచారణకు రాధాకృష్ణ వ్యక్తిగతంగా హాజరుకాక తప్పదు.

loader