మద్యం తాగి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని మంచిమాటలు చెప్పినవారిపై కోపాన్ని పెంచుకున్న ఓ తాగుబోతు వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన తాడిపత్రిలో చోటుచేసుకుంది.
అనంతపురం : ఇంటిబయట నిద్రిస్తున్న దంపతులను ఓ దుండగుడు అతి కిరాతకంగా హతమార్చడానికి ప్రయత్నించిన దారుణం అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. దుండగుడి దాడిలో దంపతులతో పాటు మరో బాలిక తీవ్రంగా గాయపడింది. ఈ ముగ్గురూ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు.
వివరాల్లోకి వెళితే... అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం సజ్జలదిన్నె గ్రామానికి చెందిన నల్లపురెడ్డి, కృష్ణవేణి దంపతులు శనివారం రాత్రి ఇంటిబయట పడుకున్నారు. వారితో పాటు పూజిత అనే చిన్నారి కూడా ఆరుబయటే పడుకుంది. అయితే అర్థరాత్రి గాఢనిద్రలో వున్న దంపతులపై గుర్తుతెలియని దుండగుడు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ మంటలు వారికి సమీపంలోనే పడుకున్న చిన్నారిని కూడా అంటుకున్నాయి. దీంతో వారి కేకలు విన్న చుట్టుపక్కల ఇళ్లవారు చేరుకునేసరికి ముగ్గురూ మంటల్లో కాలిపోతూ కనిపించారు. స్థానికులు మంటలు ఆర్పినా అప్పటికే వారి శరీరమంతా కాలిపోయింది.
తీవ్రంగా గాయపడిన దంపతులతో పాటు చిన్నారిని ఏరియా హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి మెరుగ్గానే వున్నా దంపతుల పరిస్థితి విషమంగా వున్నట్లు డాక్టర్లు తెలిపారు.
బాధిత దంపతుల కుటుంబసభ్యుల ఫిర్యాదుమేరకు పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్యాయత్నానికి పాల్పడిన దుండగుడిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఆ తాగుబోతుపైనే అనుమానాలు:
దంపతులు పనిచేసే మార్బుల్స్ కంపనీలో పనిచేసే బంధువు రమేష్ రెడ్డి ఈ దారుణానికి ఒడిగట్టి వుండాలని అనుమానిస్తున్నారు. మద్యానికి బానిసైన రమేష్ రెడ్డిని నల్లపురెడ్డి, కృష్ణవేణి దంపతులు మానేయాలని మంచిమాటలు చెప్పారని... దీంతో తననే మద్యం తాగొద్దంటారా అంటూ అతడు కోపం పెంచుకున్నట్లు భావిస్తున్నారు. దీంతో అతడే ఈ ఘాతుకానికి పాల్పడి వుంటారని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పరారీలో వున్న అతడికోసం పోలీసులు గాలిస్తున్నారు.
