ఓ దంపతులు తమ పెళ్లి చేసిన ప్రాణ స్నేహితుడినే దారుణంగా హత్య చేశారు. ఆ తరువాత మృతదేహాన్ని గోదావరిలో పడేశారు. అతని దగ్గరున్న బంగారాన్ని దోచుకున్నారు. 

కృష్ణాజిల్లా : ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణాజిల్లా పెనుమలూరులో అతి దారుణమైన హత్యోదాంతం వెలుగు చూసింది. ఓ దంపతులిద్దరూ కలిసి ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని గోదావరి నదిలో పడేశారు. తీవ్ర సంచలనం రేపిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను పెనుమలూరు పోలీసులు ఈ విధంగా తెలిపారు. మృతుడిని గ్రంథి పురుషోత్తం (41)గా గుర్తించారు. అతను ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ కు చెందిన వ్యక్తి.

పురుషోత్తం పాత కార్లు కొని, అమ్మే వ్యాపారం చేస్తుంటాడు. అతనికి పెళ్లి కాలేదు. జులై 31వ తేదీన కారు కొనే పని ఉందంటూ రాజమండ్రికి బయలుదేరాడు. ఈ మేరకు తన సోదరుడు నాగేశ్వరరావుకు సమాచారం ఇచ్చాడు. అయితే పురుషోత్తం ఆ రోజు రాజమండ్రి కి వెళ్లలేదు. పురుషోత్తం మిత్రుడైన బలగం మొహిందర్ ను మొగల్రాజపురం దగ్గర కలిశాడు. 

విశాఖ బీచ్ రోడ్డులో కారు బీభత్సం.. ముగ్గురు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు...(వీడియో)

అక్కడే అతని కారులో ఎక్కి యనమలకుదురు నేతాజీ నగర్ లో ఉన్న మొహిందర్ ఇంటికి వెళ్లారు. అక్కడ వారిద్దరూ మాట్లాడుకుంటూ మద్యం తాగుతూ అర్ధరాత్రి వరకు గడిపారు. మద్యం తాగిన తర్వాత పురుషోత్తం జాడ లేకుండా పోయాడు. కారు కొనడానికి వెళుతున్నానని చెప్పిన పురుషోత్తం తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆరా తీయగా.. ఈ విషయాలు వెలుగు చూశాయి.

దీంతో వారు మొహిందర్ ను పురుషోత్తం ఎక్కడికి వెళ్లాడని అడిగారు. అయితే, తామిద్దరం తమ ఇంటికి వచ్చిన సంగతి వాస్తవమేనని, మద్యం తాగామని.. అయితే, మధ్యలోనే పురుషోత్తం తనకు పని ఉందని చెప్పి వెళ్ళిపోయాడని తెలిపాడు. పురుషోత్తం దగ్గర ఉన్న రెండు ఫోన్లకు పోలీసులు ఫోన్ చేశారు. కానీ ఆ రెండు ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చాయి, పురుషోత్తం సోదరుడు నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా పెనమలూరు పోలీసులకు పురుషోత్తం మిస్సింగ్ మీద అనుమానాలు కలిగాయి. చివరిసారిగా పురుషోత్తంను చూసిన మొహిందర్, అతని భార్య శశికళను అనుమానించారు. ఈ మేరకు వారిద్దరిని అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్ లో విచారించారు. వెలుగు చూసిన విషయాలు పోలీసులను విస్తు పోయేలా చేశాయి. మొహిందర్, పురుషోత్తం చాలా మంచి స్నేహితులు. 

మొహిందర్ అంతకుముందు విజయవాడలో ఒక కార్ల కంపెనీలో పని చేసేవాడు. ఆ సమయంలోనే శశికళతో పరిచయమైంది. అలా వారి పరిచయం ప్రేమగా మారింది. వారిద్దరి పెళ్లిని పురుషోత్తమే దగ్గర ఉండి చేశాడు. అప్పటినుంచి మొహిందర్ ఇంటికి పురుషోత్తం తరచుగా వస్తుండేవాడు. ఈ క్రమంలోనే పురుషోత్తం దగ్గర చాలా డబ్బులు ఉన్న విషయం మొహిందర్ దంపతులకు తెలుసు.

ఇటీవల కాలంలో మొహిందర్ కు అప్పులు ఎక్కువయ్యాయి. వాటిని తీర్చే మార్గం తెలియలేదు. దీంతో శశికళ, మొహిందర్ లు పురుషోత్తంను హత్య చేయాలని ప్లాన్ చేశారు. అలా జూలై 31వ తేదీన పురుషోత్తంను తమ ఇంటికి తీసుకువెళ్లారు. బాగా మద్యం తాగించి.. మత్తులో ఉన్న సమయంలో భార్యాభర్తలిద్దరూ కలిసి పురుషోత్తం మెడకు వైరు బిగించి హత్య చేశారు.

అతని దగ్గర ఉన్న మూడు లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను దోచుకున్నారు. ఆ తర్వాత పురుషోత్తం మృతదేహాన్ని కారులోనే తీసుకెళ్లి ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరిలో పడేశారు. పురుషోత్తం బంగారాన్ని గుంటూరులో అమ్మేశారు. ఆ డబ్బుతో అప్పులు తీర్చారు. ఇక తర్వాత తమకు పురుషోత్తం గురించి ఏమీ తెలియనట్లుగా ఉండిపోయారు. కానీ, పోలీసులకు అనుమానం రావడంతో ఈ విషయం అంతా వెలుగు చూసింది. 

నిందితులు చెప్పిన ప్రకారం పురుషోత్తం మృతదేహం కోసం గోదావరిలో వెతికారు. కానీ, ఇప్పటివరకు లభించలేదు. పురుషోత్తం దగ్గర అపహరించిన బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. శశికళ,మొహిందర్ దంపతులపై హత్య కేసు నమోదు చేశారు. వారిద్దరిని అరెస్టు చేశారు.