విశాఖ బీచ్ రోడ్డులో కారు బీభత్సం.. ముగ్గురు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు...(వీడియో)
విశాఖపట్నంలో సోమవారం రాత్రి ఓ కారు కలకలం సృష్టించింది. అతివేగంతో వచ్చిన కారు అదుపుతప్పడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
విశాఖపట్నం : ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నంలో సోమవారం రాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. విశాఖ నుంచి భీమిలికి వెళ్లే రోడ్డులో కారు బీభత్సంతో ముగ్గురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మద్యం మత్తులో యువకులు కారును అతివేగంగా నడపడంతో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ద్వారకా జోన్ ఏసీపీ మూర్తి ఈ మేరకు వివరాలను తెలిపారు..విశాఖ భీమిలి మార్గంలో సోమవారం రాత్రి సాగర్ నగర్ నుంచి ఎండాడ వైపు ఒక కారు వెడుతోంది.
మితిమీరిన వేగంతో వెళుతున్న ఆ కారు రాడిసన్ హోటల్ దగ్గరికి వచ్చేసరికి సరిగ్గా మలుపు దగ్గర అదుపుతప్పింది. అతివేగంతో ఉండడంతో రోడ్డు మధ్యలోని డివైడర్ ను ఢీ కొట్టింది. ఆ తర్వాత చెట్టును ఢీ కొట్టి అవతలి వైపుకు దూసుకుపోయింది. ఆ సమయంలో అటువైపుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని గట్టిగా ఢీకొట్టింది.
హైదరాబాద్ ఐఐటీలో మరో విద్యార్థిని ఆత్మహత్య...చదువుల ఒత్తిడి తట్టుకోలేక అంటూ సూసైడ్ లెటర్...
ఆ వాహనంపై ఉన్న ఒడిశాలోని రాయగడకు చెందిన పృథ్వీరాజ్ (28), ప్రియాంక (21) అనే దంపతులు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. కారులో ప్రమాద సమయంలో మొత్తం ఆరుగురున్నారు. ఇందులో ఒకరు మృతి చెందారు. ఎం మణికుమార్ (25) కారులో వెనక సీట్లో కూర్చున్నాడు. ప్రమాదం కారణంగా తీవ్రంగా గాయాలపాలై కారులోనే మృతి చెందాడు.
మణికుమార్ ది విశాఖపట్నం, పీఏ పాలెంలోని ఆర్హెచ్ కాలనీ. మణికుమార్ తండ్రి గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మణికుమార్ డిప్లమా పూర్తి చేశాడు. ప్రమాదానికి సంబంధించిన సమాచారం తెలిసిన అరిలోవ పోలీసులు, బీచ్ పెట్రోలియం సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.
వీడియో
కారులో మణికుమార్ తో పాటు ప్రయాణిస్తున్న మరో ఇద్దరు కూడా తీవ్ర గాయాల పాలైనట్లు గుర్తించారు. మృతదేహాలను కేజీహెచ్ కు తరలించారు. క్షతగాత్రులను కూడా కేజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కారులో ఉన్న మరో ముగ్గురు పరారయ్యారు. టూవీలర్ మీద వస్తూ మృతి చెందిన పృథ్వీరాజ్ ప్రైవేట్ సంస్థలో సైట్ ఇంజనీర్ గా పని చేస్తున్నట్లుగా సమాచారం.
కారులో ఉన్న ఆరుగురు యువకులు జోగులపాలెం తీరం నుంచి సాగర్ నగర్ వైపు వస్తున్నారు. వారు అప్పటికే తాగి ఉన్నారు. సాగర్ నగర్ ఆర్చ్ దగ్గర ప్రమాదానికి కొద్దిగా సేపటి ముందు అక్కడ యువకులతో వాగ్వాదానికి కూడా దిగారు. రోడ్డు మీద మందు బాటిళ్లు పగలగొట్టి హల్చల్ చేశారు. యువకుల దగ్గర ఉన్న సెల్ ఫోన్ లాక్కున్ని వెళ్ళిపోయారు. ఈ ఘటనతో సాగర్ నగర్ యువకులు తమ మీద జరిగిన దాడికి గురించి ఫిర్యాదు చేయడం కోసం జోగుల్లపాలెం చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్లారు.
వీరు రావడంతో అక్కడ ప్రమాదం జరిగిన సంగతి తెలిసింది. ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధిత యువకులను ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు పోలీసులు. తమతో వాగ్వాదానికి దిగి ఫోన్ లాక్కెళ్ళింది ఆ కారులో వచ్చిన వారేనని యువకులు గుర్తించారు. కారులో ఉన్న సెల్ ఫోన్ ను బాధితులకు ఇచ్చేశారు. ప్రమాదానికి గురైన కారులో మరిన్ని మద్యం సీసాలు ఉండడం పోలీసులు గుర్తించారు. దీనిమీద పూర్తిస్థాయిలో విచారణ నిర్వహిస్తామని తెలిపారు. పారిపోయిన వారి గురించి గాలింపు చేపడతామన్నారు.